‘నిద్ర తన్నుకొస్తోంది.. కాసేపు కునుకు తీస్తా’ అని పనిచేసే చోట అంటే ఒప్పుకుంటారా..? ‘మీ సేవలు ఇక చాలు’ అనే సమాధానం వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండేదేమో! ఉద్యోగులు కొద్దిసేపు కునుకు తీసేందుకు అభ్యంతరం లేదంటున్నాయి స్టార్టప్ సంస్థలు. పరుపులు, మంచాలు తదితర హోమ్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ‘వేక్ ఫిట్’ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు.
‘రైట్ టు న్యాప్’ విధానాన్ని ప్రకటించారు. లంచ్ తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం ఉద్యోగుల హక్కుగా మార్చేశారు. తద్వారా ఉద్యోగుల అవసరాలను గుర్తించే సంస్థగా వేక్‌ఫిట్‌ను మార్చేశారు. నైపుణ్య మానవ వనరులు కంపెనీల పురోగతికి ఎంతో అవసరం. స్టార్టప్ సంస్థలు ఈ సూక్ష్మాన్ని గుర్తించే పనిచేస్తుంటాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో వేక్‌ఫిట్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.
పనిచేసే చోట సౌకర్యంగా ఉంటేనే..
కరోనా మహమ్మారి అనంతరం ఉద్యోగులు పనికి, ఇంటికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిచేసే చోట సౌకర్యాన్ని, సదుపాయాలకు వారు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎన్నో సర్వేలు ప్రకటించాయి. ఇదంతా డిజిటల్ ప్రపంచం. నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలకు కొరత లేదు. ఆకర్షించే ఆఫర్లతో వారు వేగంగా సంస్థలు మారిపోతున్నారు. అనుభవం కలిగి, నైపుణ్యాలున్నవారు అలా వెళ్లిపోతే.. కంపెనీల్లో కీలక పనులు పడకేస్తాయి.
అందుకనే ఉద్యోగుల వలసలు (అట్రిషన్) తగ్గించేందుకు వారిని సంతోషపరిచే పలు నిర్ణయాలను వేక్‌ఫిట్, డ్రీమ్11, ద గుడ్ గ్లామ్ గ్రూపు, బీట్‌వో, జెప్టో తదితర స్టార్టప్‌లు తీసుకుంటున్నాయి. వేక్‌ఫిట్ తీసుకున్న రైట్ టు న్యాప్ పట్ల ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నిద్ర వరకే పరిమితం అనుకోవడానికి లేదు. పుట్టిన రోజు వేడుక కోసం సెలవు కోరినా ఈ కంపెనీలు అభ్యంతరం పెట్టవు. విహార యాత్రకు వెళ్లొస్తామన్నా.. పంపించి అయిన ఖర్చులను తిరిగి రీయింబర్స్ చేస్తున్నాయి. అంతేకాదు చాట్‌బాట్స్ సాయంతో సంస్థ అందిస్తున్న సేవలపై ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కార్పొరేట్ సంస్కృతిని మార్చేలా కొత్త సంస్థల విధానాలు ఉంటున్నాయని చెప్పుకోవాలి.
ఉద్యోగుల్లో మారిన ధోరణి..
ఈ తరహా చర్యలు అదనపు ప్రభావాన్ని చూపిస్తాయని వేక్‌ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ తెలిపారు. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండడం.. తమకున్న నైపుణ్యాలకు కొత్త కొత్త అవకాశాలు పలుకరిస్తుండడం, అననుకూల పనివేళలు ఇవన్నీ కూడా ఉద్యోగులు సంస్థలు వీడేందుకు కారణమవుతున్నాయి. దీంతో ఈ పరిస్థితులను అధిగమిచేందుకు ఉద్యోగులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగుల సౌకర్యాన్ని చూస్తున్నాయి.
ఉత్పాదకత పెరుగుతుంది..!
మధ్యాహ్నం భోజనం తర్వాత 30 నిమిషాలు నిద్రించడం వల్ల రోజంతా తాజాగా ఉంటారని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పటి వరకు పడిన అలసట 20–30 నిమిషాల నిద్రతో పూర్తిగా తొలగిపోతుందట. ఉద్యోగులు లంచ్ తర్వాత కొద్ది సేపు అలా నడుము వాల్చేందుకు అనుమతిస్తే.. అది కంపెనీల ఉత్పాదకతను కూడా పెంచుతుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment