ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు దిగ్గజాలు గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. వారాంతాన(13న) డీమార్ట్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ4 పనితీరు వెల్లడించింది.
ఈ బాటలో బెర్జర్ పెయింట్స్, ఫైజర్ ఈ నెల 15న, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్‌టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 16న, స్టేట్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, గెయిల్ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) 18న, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, 19న ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ఉన్నాయి. డీమార్ట్ ఫలితాల ప్రభావం నేటి(15న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఐఐపీ, ధరల ఎఫెక్ట్
శుక్రవారం(12న) మార్కెట్లు ముగిశాక మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలు వెలువడ్డాయి. ఇక ఏప్రిల్ నెలకు రిటైల్ ధర ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలూ వెల్లడయ్యాయి. నేడు ఏప్రిల్ టోకుధరల ద్రవ్యోల్బణ తీరు వెల్లడికానుంది. ఈ ప్రభావం సైతం మార్కెట్లలో నేడు కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లో నెలకొనే పరిస్థితులు ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. ఏప్రిల్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు 16న వెలువడనున్నాయి. జపాన్ ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలను 19న ప్రకటించనుంది.
ఇతర అంశాలు
కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో సీపీఐ 18 నెలల కనిష్టానికి చేరినప్పటికీ ఐఐపీ ఐదు నెలల కనిష్టాన్ని తాకడం బలహీన అంశమని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. విద్యుత్, తయారీ రంగాలు ఇందుకు కారణమయ్యాయి. ఇవికాకుండా డాలరుతో రూపాయి మారకపు తీరు, బాండ్ల ఈల్డ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడి చమురు ధరలు తదితర అంశాలూ మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని వివరించారు.
కర్ణాటక్ మ్యూజిక్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగా అత్యంత ఆసక్తిని రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరగా.. దశాబ్ద కాలం తదుపరి కాంగ్రెస్ పటిష్ట మెజారిటీని సాధించింది. ఇది కొంతమేర మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు.
గత వారం జూమ్
గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 974 పాయింట్లు జంప్‌చేసి 62,000 మార్క్‌ను మళ్లీ దాటింది. 62,027 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 246 పాయింట్లు ఎగసి 18,315 వద్ద ముగిసింది. మార్కెట్ల ప్రభావంతో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం, స్మాల్ క్యాప్ 1.2 శాతం చొప్పున బలపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment