విద్య కంటే పెళ్లిళ్లకే అధిక ఖర్చు
ఎఫ్‌ఎంసీజీ తర్వాత రెండో స్థానం
ఎన్నో రంగాల్లో డిమాండ్‌కు ఊతం
జెఫరీస్ నివేదికలో ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.
వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్‌ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు.
వినియోగంలో
భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే.
‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది.
ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు
ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment