రూ. 5 వేల కోట్లకు ఆడియో డివైజ్‌ల మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆడియో డివైజ్‌ల ఆఫ్‌లైన్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. జూన్‌తో ముగిసిన పన్నెండు నెలల వ్యవధిలో మూవింగ్ యాన్యువల్ టర్నోవర్ (ఎంఏటీ) ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ. 3,400 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల స్థాయికి చేరింది. మరింత మెరుగైన అనుభూతినిచ్చే సౌండ్ టెక్నాలజీలు రావడం, వ్యక్తిగత–గృహ కేటగిరీల్లో అత్యంత నాణ్యమైన ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఈ విభాగ వృద్ధికి తోడ్పడుతున్నాయి.
పర్సనల్ ఆడియో సెగ్మెంట్‌లో అమ్మకాల పరిమాణం 61 శాతం మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్, కన్జూమర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్‌ఐక్యూలో భాగమైన జీఎఫ్‌కే రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆడియో డివైజ్‌లపై భారతీయ వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు, సౌకర్యవంతంగా వినేందుకు వారు మొగ్గు చూపుతున్నారు.
మార్కెట్లో ఇప్పటికీ కాంపాక్ట్ స్టీరియో సిస్టమ్స్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, హోమ్ థియేటర్, స్మార్ట్ ఆడియో విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జెన్ జెడ్ కస్టమర్లకు హెడ్‌ఫోన్లు, హెడ్‌సెట్లు, మినీ/బ్లూటూత్ స్పీకర్లు తప్పనిసరి డివైజ్‌లుగా మారాయి. పాడ్‌కాస్ట్‌లు, ఆడియో సిరీస్‌ల్లాంటి కొత్త రకం కంటెంట్ ఫార్మాట్లు పెరుగుతుండటం కూడా ఈ ఉత్పత్తులకు దన్నుగా ఉంటోంది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
» వైర్‌లెస్, ట్రూ వైర్‌లెస్ డివైజ్‌లకు, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లకు డిమాండ్ పెరిగింది. సగటు అమ్మకం ధర సుమారు 18 శాతం తగ్గింది.
» పర్సనల్ ఆడియో సెగ్మెంట్‌లో ట్రూ వైర్‌లెస్ హెడ్‌సెట్స్‌కి గణనీయమైన ఆదరణ నెలకొంది. దీంతో ఈ విభాగంలో వాటి వాటా 38 శాతానికి పెరిగింది.
» మినీ/బ్లూటూత్ స్పీకర్ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. రూ. 2,000 వరకు ధర ఉండే ఎంట్రీ లెవెల్ ప్రోడక్టుల విక్రయాలు 3 శాతం పెరిగాయి.
» లౌడ్‌స్పీకర్ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ. 1,100 కోట్లకు చేరాయి. ఇందులో సౌండ్‌బార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 70 శాతం అమ్మకాలు బడా రిటైల్ చెయిన్ల ద్వారా ఉంటున్నాయి. ఇందులోనూ సౌత్ జోన్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు లౌడ్‌స్పీకర్ల డిమాండ్‌కి హాట్‌స్పాట్లుగా మారాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో అమ్మకాలకు ఈ విభాగంలోని విక్రయాల్లో దాదాపు 30 శాతం వాటా ఉండటమనేది, మెట్రోపాలిటన్‌యేతర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment