ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలలో ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. అయితే దేశంలో ఎక్కడైనా టోల్ ట్యాక్స్ ఒకేలా ఉంటుంది. కానీ మన దేశంలోని ఓ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించాలంటే కొంత ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఎక్స్‌ప్రెస్‌వే ఏది? సాధారణ హైవే మీదకంటే ఇక్కడ ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలో అత్యంత ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే ఏది అంటే చాలామంది చెప్పే సమాధానం 'ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే'. దీన్ని 22 సంవత్సరాల క్రితం నిర్మించారు. కాబట్టి దేశంలో అతి పురాతనమైన, మొదటి ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్ని పరిగణిస్తారు. 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్మించారు. ఈ రహదారి మహారాష్ట్రలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన ముంబైని పూణేకి కలుపుతుంది.
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే అనేది దేశంలోనే మొదటి 6 లేన్ల రోడ్ కూడా. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 163000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు 94.5 కిలోమీటర్లు. ఇది నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతం నుంచి ప్రారంభమై పూణేలోని కివాలే వద్ద ముగుస్తుంది. దీన్ని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన తరువాత ముంబై & పూణే మధ్య ప్రయాణించే సమయాన్ని మూడు గంటల నుంచి 1 గంటకు తగ్గించింది. అంటే ఈ రోడ్డుపై ప్రయాణించేవారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు. కాబట్టి ఎక్కువమంది ఈ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే సొరంగాలు, అండర్ పాస్‌లను కలిగి ఉంది.
టోల్ ట్యాక్స్
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ కిలోమీటరుకు రూ. 3.40 వసూలు చేస్తుంది. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల మీద ఈ ఛార్జ్ కేవలం రూ. 2.40 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఛార్జ్ ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.
టోల్ ట్యాక్స్ ఎక్కువగా వసూళ్లు చేయడానికి కారణం!
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు, అంతే కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అయితే ప్రారంభంలో ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఈ ఛార్జెస్ పెరుగుదలకు కారణమనే తెలుస్తోంది. ట్రాఫిక్ వాల్యూమ్, ప్రభుత్వ పన్నులు మొదలైనవి కూడా టోల్ ఫీజు ఎక్కువగా వసూలు చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment