ఇండిగో ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. గురువారం (ఫిబ్రవరి 9) హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 409 విమానం 37 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. విశాఖపట్నం చేరుకున్న అనంతరం తమ బ్యాగుల కోసం వెతికిన ప్రయాణికులు.. వాటిని విమాన సిబ్బంది అక్కడే వదిలేసి వచ్చారని తెలుసుకుని ఎయిర్ లైన్స్ యాజమాన్యంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం స్పందిస్తూ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. జరిగిన పొరబాటు మానవ తప్పిదమని, 37 మంది ప్రయాణికుల బ్యాగులను వారి విశాఖపట్నంలోని వారి చిరునామాలకు వీలైనంత త్వరగా, సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలియజేసింది.
కాగా లగేజీని విమాన సిబ్బంది హైదరాబాద్‌లోనే వదిలేసి వచ్చారని తెలుసుకున్న ప్రయాణికులు తమ బ్యాగుల కోసం గంటతరబడి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనే ఎదురుచూశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపటికి లగేజీని సురక్షితంగా ప్రయాణికుల ఇళ్లకు చేరుస్తామని విమాన సంస్థ హామీ ఇవ్వడంతో శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment