న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,998 కోట్లను అధిగమించింది. వెరసి వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభదాయక పనితీరును ప్రదర్శించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,423 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 15,410 కోట్ల నుంచి రూ. 20,062 కోట్లకు ఎగసింది.
ఈ కాలంలో 15.4 శాతం నికర లాభ మార్జిన్లు ఆర్జించినట్లు ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. వరుసగా ఐదు క్వార్టర్లపాటు లాభాలు సాధించడంతో కోవిడ్–19 కారణంగా నమోదైన నష్టాల నుంచి రికవర్ అయినట్లు తెలియజేశారు. సానుకూల నెట్‌వర్త్‌కు చేరినట్లు వెల్లడించారు. ఈ క్యూ3లో ప్రయాణికుల టికెట్ ఆదాయం 30 శాతంపైగా జంప్‌చేసి రూ. 17,157 కోట్లను తాకగా.. అనుబంధ విభాగాల నుంచి 24 శాతం అధికంగా రూ. 1,760 కోట్లు లభించినట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 2 శాతం పుంజుకుని రూ. 3,127 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment