న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2021లో 20 శాతం మేర తగ్గొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా అంచనా వేసింది. 2020లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 298 కోట్ల డాలర్లుగా (రూ.22,350కోట్లు) ఉన్నాయి. 2020 ఇదే కాలంలో పెట్టుబడులు 153 కోట్ల డాలర్లతో (రూ11,475) పోలిస్తే సుమారు రెట్టింపయ్యాయి. కానీ, 2020 చివరి మూడు నెలల్లో భారీ ఒప్పందాలు (3.2 బిలియన్ డాలర్ల మేర) నమోదయ్యాయి. దీంతో 2020 మొత్తం మీద ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు దూసుకుపోయాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండకపోవచ్చన్నది జేఎల్‌ఎల్ అంచనా. భారీ పెట్టుబడుల ఒప్పందాలు చోటు చేసుకుంటే మినహా.. 2021 మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 3.8–4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని పేర్కొంది.
వచ్చే ఏడాది ఆశాజనకమే
2022పై ఆశావహ అంచనాలనే జేఎల్‌ఎల్ ఇండియా వ్యక్తం చేసింది. 5 బిలియన్ డాలర్ల మార్క్‌ను (రూ.37,500 కోట్లు) అధిగమించొచ్చని పేర్కొంది. 2017–2020 మధ్య పరిశ్రమలోకి ఇదే స్థాయిలో పెట్టుబడులు వార్షికంగా రావడం గమనార్హం. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ఇనిస్టిట్యూషన్స్‌గా పేర్కొంటారు. ఫ్యామిలీ ఆఫీసులు అంటే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల వ్యక్తిగత పెట్టుబడుల వేదికలు.
Comments
Please login to add a commentAdd a comment