Integral Rail Coach Factory: World's Biggest ICF From Chennai - Sakshi
Sakshi News home page

చెన్నైలోని ఐసీఎఫ్‌.. ప్రపంచ దేశాల్లో ఈ పేరు మారుమోగుతోంది.. ఎందుకో తెలుసా!

Published Sat, Jul 23 2022 6:14 PM | Last Updated on Sat, Jul 23 2022 10:04 PM

Integral Rail Coach Factory: Worlds Biggest Icf From Chennai - Sakshi

కొరుక్కుపేట(చెన్నై): చెన్నై పెరంబూర్‌లోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతున్న పేరు. అత్యాధునిక, భద్రతతో కూడిన రైలు కోచ్‌లను తయారు చేయటంలో ఐసీఎఫ్‌కు మరొకటి సాటిలేనంతగా ఎదిగింది. రైల్వే ఉద్యోగులు, కార్మికులు అహర్నిశలు నిబద్ధతతో పనిచేయటం వల్లే ప్రపంచ దేశాలు ఐసీఎఫ్‌ వైపు చూస్తున్నాయి. తెలుగు ఉద్యోగులు, కార్మికులు ఇక్కడ అధిక సంఖ్యలో ఐసీఎఫ్‌లో పనిచేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత, మెరుగైన, సౌకర్యవంతమైన సేవలనే ప్రధానంగా చేసుకుని కోచ్‌ల తయారీలో నూతన ఒరవడిని సృష్టిస్తుంది ఐసీఎఫ్‌. 

తొలి దేశీయ ఉత్పత్తి యూనిట్‌ 
1955 అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించిన స్వతంత్ర భారతదేశంలోని తొలి దేశీయ ఉత్పత్తి యూనిట్లలో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఒకటి. సంవత్సరానికి 350 రైలు కోచ్‌ల సామర్థ్యంతో ఆల్‌–స్టీల్, ఆల్‌–వెల్డెడ్‌ షెల్‌ల తయారీ నుంచి, ఉత్పత్తి యూనిట్‌ ఆరంభమైంది. మొత్తం 511 ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారంలో సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంచలంచెలుగా ఐసీఎఫ్‌ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు ఏటా 4,000 కోచ్‌లకు పైగా విడుదల చేస్తూ సరికొత్త ఆవిష్కరణలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. దేశీయ డిమాండ్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ రైల్వే ఆపరేటర్లకు కూడా ప్రత్యేక భూమిక పోషిస్తోంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద కోచ్‌ తయారీ..
ఐసీఎఫ్‌ ఫర్నిషింగ్‌ విభాగం అక్టోబర్‌ 1962లో ప్రారంభమైంది. అప్పటి నుంచి రైలు కోచ్‌ల తయారీలో వేగంగా అడుగులు వేసింది. యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్‌ –19 మహమ్మారి సమయంలో కూడా తగిన పరిమితులు ఉన్నప్పటికీ, ఐసీఎఫ్‌ 2021–22లో 3,100 కోచ్‌లను తయారు చేసి అరుదైన ఘనతను సాధించింది. ఇందులో మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ 31 ర్యాక్‌లు (248 కోచ్‌లు), 15 విస్టాడోమ్‌ టూరిస్ట్‌ కోచ్‌లు, 2,639 లింకే హాఫ్‌ మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు, కోల్‌కతా మెట్రో రైలు కోసం 4 ఎయిర్‌ కండిషన్‌ కొత్త తరం ర్యాక్‌లు, అలాగే 50 డీజిల్‌ కార్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి. 2019–20 సంవత్సరంలో 4,166 కోచ్‌ల ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుత ఉత్పత్తి సంవత్సరమైన 2022–23కి దాదాపు 50 వేరియంట్లలో 4,275 కోచ్‌ల ఆల్‌ టైమ్‌ హై టార్గెట్‌ను చేరుకునేందుకు కోచ్‌ల తయారీలో వేగం పెంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్యాసింజర్‌ కోచ్‌ తయారీదారుగా ఐసీఎఫ్‌ అవతరించి అందరినీ మన్ననలు పొందుతుంది. 

హరిత కార్యక్రమాల దిశగా.. 
పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఐసీఎఫ్‌ ప్రత్యేక దష్టి సారించింది. రిశ్రామిక కార్యకలాపాల కారణంగా గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్ఘారాలను పూర్తిగా తటస్థీకరించి, కార్బన్‌ ప్రతికూల స్థితిని సాధించిన భారతీయ రైల్వేలలో ఐసీఎఫ్‌ మాత్రమే అని చాలామందికి తెలియదు. ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకమైన పర్యావరణ కోసం చెట్లను విరివిగా పెంచటం, విద్యుత్‌ ఉత్పత్తి కోసం గాలిమరలు, సౌర ఫలకాలను ఏర్పాటు చేయడంలో ఐసీఎఫ్‌ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.  

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ తయారీ ఇక్కడే 
మేకిన్‌ ఇండియా చొరవతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపుదిద్దుకున్నది ఐసీఎఫ్‌లోనే. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ట్రైయిన్‌– 18’కు ఇక్కడే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ – వారణాసి మధ్య తిరగనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తయారీ కోసం రూ.97 కోట్ల వ్యయం చేశారు. దాదాపు 18 నెలల్లో సిద్ధమైన ఈ రైలు దేశంలోనే తొలి లోకో మోటివ్‌– లెస్‌ రైలు కావటం విశేషం. కొన్ని డజన్ల వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రేక్‌లు ఐసీఎఫ్‌ రైల్వేకు చెందిన ఇతర కోచ్‌ ల తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తిలో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement