ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ మరోసారి ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫలితంగా సూచీలు గడిచిన ఏడు నెలలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మూడు వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రం వెనక్కి తగ్గడంతో పాటు సౌదీ ఆరామ్‌కో – రిలయన్స్ ఒప్పందం రద్దు కావడంతో మార్కెట్‌కు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రకంపనలు, ప్రపంచ మార్కెట్లలో బలహీనతలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,170 పాయింట్లు నష్టపోయి 58,466 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 348 పాయింట్లు క్షీణించి 17,417 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. వ్యవసాయ చట్టాల రద్దుతో ప్రభుత్వ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు.., నిఫ్టీ 50 షేర్లలో ఎనిమిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3439 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2051 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొమ్మిది పైసలు బలహీనపడి 74.39 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..!
ఉదయం సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 59,710 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 17,796 వద్ద ప్రారంభమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1625 పాయింట్లు క్షీణించి 58,011 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇంట్రాడేలో 17,280 వద్ద కనిష్టాన్ని, 17,805 వద్ద గరిష్టాన్ని తాకింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► గత గురువారం లిస్టయిన ఫిన్‌టెక్ పేటీఎం షేర్లు పతనం కొనసాగింది. ఇంట్రాడేలో 19 శాతం క్షీణించి రూ.1,271 వద్ద దిగివచ్చింది. చివరికి 13 శాతం నష్టంతో రూ.1,360 వద్ద స్థిరపడింది. అధిక వ్యాల్యూయేషన్ల ఆందోళనలు పేటీఎం షేర్ల అమ్మకానికి ప్రేరేపించినట్లు నిపుణులు తెలిపారు. ఇష్యూ ధర రూ.2,150 పోలిస్తే కంపెనీ రెండురోజుల్లో 37 శాతం పతనమైంది. సుమారు రూ.50వేల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. బీఎస్‌ఈలో ఎక్సే్చంజీలో మొత్తం 19.12 లక్షల షేర్లు చేతుల మారాయి.
రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందం రద్దుతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) షేరు నాలుగున్నర శాతం నష్టపోయి రూ.2,363 వద్ద స్థిరపడింది. ఒకదశలో ఐదు శాతం క్షీణించి రూ.2,351 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో ఆర్‌ఐఎల్ ఒక్కరోజులోనే రూ.69,364 కోట్ల సంపదను కోల్పోయింది.
► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ ఎయిర్‌టెల్ షేరు లాభపడింది. మొబైల్ ప్రీపెయిడ్ టారీఫ్‌లను 20–25 శాతం పెంచడం షేరు రాణించేందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఆరుశాతం ఎగసి రూ.756 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో నాలుగు శాతం లాభంతో రూ.742 వద్ద ముగిసింది.
► హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అనుబంధ సంస్థ వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.328 వద్ద ముగిసింది.
(చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్‌లను తుడిచి పెట్టింది)
పతనానికి కారణాలు...
బలహీనంగా దేశీయ పరిణామాలు
రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందం రద్దుతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) షేరు నాలుగున్నర శాతం నష్టపోయింది. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ కలిగిన ఆర్‌ఐఎల్ పతనం సూచీలకు భారీ నష్టాన్ని కలిగించింది. కేంద్రం వివాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా దేశీయ మార్కెట్ నుంచి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింత పెరగవచ్చని ఆందోళనలు నెలకొన్నాయి. ఐపీఓ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు లిస్టింగ్‌లో నిరాశపరచడంతో పాటు తరువాత రోజు కూడా భారీ నష్టాల్ని చవిచూడటం మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇటీవల చాలా కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓల బాటపట్టడంతో లిక్విడిటి సెకండరీ మార్కెట్ నుంచి ప్రాథమిక మార్కెట్‌కు తరలిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలు అందాయి. చైనా అక్టోబర్ రిటైల్ అమ్మకాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఆస్ట్రియా లాక్‌డౌన్‌ను విధించింది. మరికొన్ని దేశాలూ ఇదే యోచన చేస్తున్నాయి. ఫలితంగా యూకే, ఇటలీ, ఫ్రాన్ దేశాల స్టాక్ సూచీలు అరశాతం నష్టపోయాయి. ఇదే కోవిడ్ భయాలతోపాటు ద్రవ్యోల్బణ ఆందోళనలతో గతవారాంతంలో అమెరికా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి.
వడ్డీరేట్ల పెంపు భయాలు
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు ముందుగానే కీలక రేట్లను పెంచవచ్చనే ఆందోళన పెరుగుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
(చదవండి: దేశంలో కోట్లలో సంపాదిస్తున్న టాప్-10 యూట్యూబర్స్ వీరే!)
Comments
Please login to add a commentAdd a comment