ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్‌లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్‌ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.
తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే..
చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment