ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి. వెరసి వారంతాన(13న) మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యాయి. ఈ బాటలో వచ్చే వారం సైతం మరో 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టనుండగా.. 11 కంపెనీలు లిస్ట్‌కానున్నాయి.
వన్ మొబిక్విక్
డిజిటల్ పేమెంట్ సేవలు, ఫైనాన్షియల్ ప్రొడక్టుల అప్లికేషన్ సంస్థ వన్ మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో చివరి రోజు శుక్రవారానికల్లా 119 రెట్లుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. తద్వారా రూ. 572 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,18,71,696 షేర్లు ఆఫర్ చేయగా.. 141,72,65,686 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దాదాపు 135 రెట్లు అధికంగా స్పందించగా.. క్విబ్ విభాగంలో 120 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 109 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 265–279 ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 257 కోట్లు సమీకరించింది.
విశాల్ మెగా మార్ట్
రిటైల్ స్టోర్ల దిగ్గజం విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. చివరి రోజు శుక్రవారానికల్లా 27 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 75,67,56,757 షేర్లు ఆఫర్ చేయగా.. 20,64,25,23,020 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్విబ్ విభాగంలో 81 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 14 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 2.3 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 74–78 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,400 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే.
సాయి లైఫ్ సైన్సెస్
కాంట్రాక్ట్ రీసెర్చ్ ఫార్మా రంగ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు శుక్రవారానికల్లా 10 రెట్లుపైగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 3,043 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3,88,29,848 షేర్లు ఆఫర్ చేయగా.. 39,85,59,690 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 31 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 1.4 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 522–549 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 913 కోట్లు సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment