ముంబై: బీమా సుగమ్ పేరుతో ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఆగస్ట్ నాటికి ఇది వస్తుందనుకోగా, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోనుందని తాజా సమాచారం. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఉంది. బీమా సుగంతో దేశంలో బీమా సేవల విస్తరణ పెరుగుతుందని, క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులభంగా మారుతుందని భావిస్తున్నారు. బీమా సుగమ్ ప్రారంభమైతే బీమా కంపెనీలు దీని ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు పాలసీల కొనుగోలు, క్లెయిమ్‌లు సహా అన్ని రకాల సేవలను ఒకే వేదికగా పొందొచ్చు. శుక్రవారం ముంబైలో ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏబీఏఐ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీమా సుగం ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, కస్టమర్‌కు అన్ని రకాల ఎంపికలను ఒకే వేదికంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యల్లేని విధంగా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. హెల్త్ క్లెయిమ్స్ ఎక్సే్ఛంజ్ ఏర్పాటుపైనా ఐఆర్‌డీఏఐ దృష్టి పెట్టింది. దీన్ని వేగంగా తీసుకొచ్చేందుకు సాధారణ బీమా సంస్థల సీఈవోలతో మాట్లాడినట్టు పాండా తెలిపారు.
సమయం ఆదా
బీమా సుగమ్‌తో సమయం ఆదా అవుతుందని పాండా చెప్పారు. బీమా సంస్థలకు క్లెయిమ్‌ల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. పాలసీదారులు, ఆస్పత్రులు ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment