న్యూఢిల్లీ: విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవలే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ పొందిన జెట్ ఎయిర్‌వేస్ తాజాగా నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు వెల్లడించింది. చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా ప్రభ్ శరణ్ సింగ్, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా హెచ్‌ఆర్ జగన్నాథ్, ఇన్‌ఫ్లయిట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా మార్క్ టర్నర్, సేల్స్ తదిర విభాగాల వైస్ ప్రెసిడెంట్‌గా విశేష్ ఖన్నా నియమితులైనట్లు తెలిపింది. వచ్చే నెలలో కొందరు బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది.
సింగ్ ప్రస్తుతం డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో సీఈవోగా చేసిన జగన్నాథ్‌కు ఏవియేషన్ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. టర్నర్ గతంలో కూడా జెట్ ఎయిర్‌వేస్‌లో సేవలు అందించారు. గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్ మొదలైన వాటిలో సీనియర్ మేనేజ్‌మెంట్ హోదాలో పని చేశారు. ఖన్నా ప్రస్తుతం వీఎఫ్‌ఎస్ గ్లోబల్‌లో బిజినెస్ హెడ్ (ఈ–వీసా విభాగం)గా ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో 2019 ఏప్రిల్ 17న మూతబడిన జెట్ ఎయిర్‌వేస్‌ను జలాన్–కల్రాక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment