Senior Executives
-
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
నైకాలో ఏం జరుగుతోంది? బోర్డుకు ఐదుగురు గుడ్‌బై!
న్యూఢిల్లీ: బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా(ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) బోర్డు నుంచి ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో సూపర్‌స్టోర్ సీఈవో వికాస్ గుప్తా, ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ ఆస్థాన, చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్ మనోజ్ గంధి, బిజినెస్ హెడ్ సుచీ పాండ్య, ఫైనాన్స్ హెడ్ లలిత్ ప్రుతి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలియజేశాయి. అయితే ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలకు కారణాలు తెలియరాలేదు. (విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత) కాగా.. ఏడాది కాలంగా నైకాలో బాధ్యతలు నిర్వహిస్తున్న లలిత్ తాజాగా ఎడ్టెక్ సంస్థ యునివోలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా చేరినట్లు తెలుస్తోంది. రాజీనామాలు స్వచ్చందం(వొలంటరీ)గా, అప్రయత్నం(ఇన్వొలంటరీ)గా చేసినట్లు నైకా పేర్కొంది. 3,000 మందికిపైగా ఉద్యోగులతో వేగవంత వృద్ధిపై దృష్టి పెట్టి సాగుతున్న నైకా వంటి కంపెనీలలో వొలంటరీ, ఇన్వొలంటరీగా రాజీనామాలకు అవకాశమున్నట్లు వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా దేశంలో అత్యున్నత నైపుణ్యాలకు కంపెనీ మద్దతిస్తూ వస్తున్నట్లు తెలియజేసింది. మధ్యస్థాయి పొజిషన్లలో రాజీనామాలు ప్రామాణిక వార్షిక ప్రోత్సాహాలు, మార్పులలో భాగమని, పనితీరు లేదా ఇతర అవకాశాలరీత్యా ఇవి జరుగుతుంటాయని వివరించింది. ప్రస్తుత, గతంలో పనిచేసిన ఉద్యోగుల సేవలకు నైకా ఎల్లప్పుడూ విలువ ఇస్తుందని ఒక ప్రకటనలో తెలియజేసింది. కంపెనీ నుంచి తప్పుకున్న వారంతా ఏడాది నుంచి మూడున్నరేళ్ల కాలం మధ్య పనిచేసిన వారేకావడం గమనార్హం! (బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్ ) -
టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ నాల్గవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించింది. కంపెనీలోని ఉన్నతోద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించింది. సీనియర్ల ప్రతిభను, అనుభవాన్ని నిలుపుకునే క్రమంలో ఈచర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను పై స్థాయిలకు ప్రమోట్ చేసింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్లు ఇంతకుముందెపుడూ ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో కీలక ఉన్నతస్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రతిభావంతులైన లీడర్షిప్ ఉద్యోగుల పైప్‌లైన్‌ను బలోపేతం చేయడానికి రికార్డు స్థాయిలో సీనియర్ ప్రమోషన్లను ప్రారంభించింది విప్రో. కంపెనీ 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్విపి) పదవికి ఎలివేట్ చేయగా, 61 మంది ఎగ్జిక్యూటివ్‌లను వైస్ ప్రెసిడెంట్ (వీపీ)గా ప్రమోట్ చేసింది. ఫలితంగా విప్రోలో ఇప్పుడు దాదాపు 200 మంది వీపీలు, 32 ఎస్వీపీలు సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23.3శాతం అట్రిషన్‌ను నమోదు చేసిన కంపెనీ అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ఈ శుక్రవారం ప్రకటించనుంది. కాగా గత ఏడాది, నాలుగు దేశాల్లో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న కనీసంనలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రో నుంచి నిష్క్రమించారు. బ్రెజిల్లో వ్యాపారాన్ని పర్యవేక్షించిన డగ్లస్ సిల్వా, జపాన్ హెడ్, టోమోకి టేకుచి,ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సారా ఆడమ్-గెడ్జ్; మిడిల్ ఈస్ట్ రీజియన్ బిజినెస్ హెడ్ మొహమ్మద్ అరేఫ్ సంస్థను వీడిని సంగతి తెలిసిందే. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్‌యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్‌యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్‌యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
జెట్ ఎయిర్వేస్లో కొత్తగా నియామకాలు
న్యూఢిల్లీ: విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవలే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ పొందిన జెట్ ఎయిర్వేస్ తాజాగా నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు వెల్లడించింది. చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా ప్రభ్ శరణ్ సింగ్, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా హెచ్ఆర్ జగన్నాథ్, ఇన్‌ఫ్లయిట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా మార్క్ టర్నర్, సేల్స్ తదిర విభాగాల వైస్ ప్రెసిడెంట్‌గా విశేష్ ఖన్నా నియమితులైనట్లు తెలిపింది. వచ్చే నెలలో కొందరు బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. సింగ్ ప్రస్తుతం డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో సీఈవోగా చేసిన జగన్నాథ్‌కు ఏవియేషన్ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. టర్నర్ గతంలో కూడా జెట్ ఎయిర్వేస్లో సేవలు అందించారు. గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్ మొదలైన వాటిలో సీనియర్ మేనేజ్మెంట్ హోదాలో పని చేశారు. ఖన్నా ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో బిజినెస్ హెడ్ (ఈ–వీసా విభాగం)గా ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో 2019 ఏప్రిల్ 17న మూతబడిన జెట్ ఎయిర్వేస్ను జలాన్–కల్రాక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. -
ఎయిర్ ఏషియాకు షాకిచ్చిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. "భద్రతా ఉల్లంఘనలపై" సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మాజీ పైలట్, ప్రముఖ యూట్యూబర్ కెప్టెన్ గౌరవ్ తనేజా ఆరోపణలకు మేరకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. జూన్ లోనే వీరికి షోకాజ్ నోటీసుల జారీ చేశామనీ, ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ హెడ్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ నేమాను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించామని సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నతనేజా ఈ సంవత్సరం జూన్ లో ఎయిర్ ఏషియా ఇండియాపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనపై వేటు వేశారంటూ ఒక వీడియోను షేర్ చేసిన ఆయన విమానయాన సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపించారు. ప్రయాణీకుల క్షేమం కోసం మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారంటూ ఒక వివరణాత్మక వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇంధన ఆదా సాకుతో "ఫ్లాప్-3" మోడ్‌లో 98 శాతం ల్యాండింగ్‌లు చేయాలని పైలట్లపై ఒత్తిడి చేస్తోందని, అలా చేయని వారిని ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఉల్లంఘనగా పేర్కొంటోందని ఆరోపించారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సురక్షితమైంది కాదా, లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్లాప్-3 ల్యాండింగ్‌లు చేయమంటోందని, ఇది ప్రయాణీకుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ట్విటర్ లో దుమారం రూగింది. దీనిపై స్పందించిన డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించామనీ, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య
ఫరీదాబాద్: టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్నిదం పాల్ (35) దారుణ హత్యకు గురయ్యారు. కంపెనీ గిడ్డంగిలోనే నవంబర్ 9వ తేదీ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంస్థ మాజీ ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఉద్యోగి విశ్వాష్ పాండే(32) ఆఫీసు మెయిన్ గేటునుంచి ఆఫీసులోకి ఎంటర్ అయ్యి, నేరుగా సీనియర్ మేనేజర్ పాల్ క్యాబిన్లోకి చొరబడ్డాడు. అతిసమీపం నుంచి పొట్టలో ఐదుసార్లు కాల్పులు జరిపి మరోగేటు నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాండేను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. కోలకతాకు చెందిన పాల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు ఇంకా పరారీలోఉన్నాడు. మరోవైపు నిందితుడు 2015లో టాటాస్టీల్ ప్రోసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీఎస్‌పీఎస్‌డీఎల్)లో ఉద్యోగంలో చేరాడు. అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2018, ఆగష్టులో తొలగించినట్టు టీఎస్‌పీఎస్‌డీఎల్ వెల్లడించింది. మృతుని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిందితుడు పాండే దూకుడుగా ఉండేవాడనీ, సహచరులు, ఇతర సీనియర్లతో తరచూ గొడవలు పడుతూ వుండేవాడని కంపెనీ ఇతర ఉద్యోగుల కథనం. మరోవైపు హతుడు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే సంస్థ అతడిని ఉద్యోగంనుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న పాండే ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. -
వారి కోసం ఫ్లిప్‌కార్ట్ వెతుకులాట
న్యూఢిల్లీ : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఈ-రిటైల్ స్పేస్‌లో మరింత పోటీ పెరిగింది. ఈ పోటీ నేపథ్యంలో అమెజాన్‌కు చెక్ పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ తన లీడర్షిప్ టీమ్‌ను బలోపేతం చేసుకుంటోంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను వెతుకుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నాలుగు పోస్టులకు కంపెనీ వెతుకులాట చేపట్టిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాటిలో ఒకటి హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్, రెండు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, మూడు చీఫ్ హెచ్ఆర్, నాలుగు సప్లై చైన్, మార్కెటింగ్ సీనియర్ అని పేర్కొన్నాయి. వాల్‌మార్ట్ డీల్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ నియమకాలు చేపడుతోంది. ఈ సెర్చింగ్లతో అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తూ.. మరింత ముందుకు దూసుకెళ్తూ.. పెద్ద మొత్తంలో మార్కెట్‌ను తన సొంతం చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తున్నట్టు ఓ దిగ్గజ సెర్చ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని ప్రొడక్ట్ కేటగిరీలు, మిషన్ టెర్నింగ్ వంటి హైఎండ్ టెక్నాలజీల కోసం నియమించుకుని, ఫ్లిప్‌కార్ట్ విస్తరణ చేపడుతుందని ఈ-కామర్స్ మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ మెగా డీల్‌తో ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సపోర్టుతో అమెజాన్‌పై పోటీకి దిగనుంది. దీని కోసం కూడా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన, అతిపెద్ద టీమ్ అవసరమని ఈఎంఏ పార్టనర్స్ ఇంటర్నేషనల్ సీనియర్ పార్టనర్ ఎం రామచంద్రన్ అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. అమెజాన్‌కు వ్యతిరేకంగా తన కంపెనీని మరింత విస్తరించేందుకు ఈ లీడర్షిప్ టీమ్ ఎంతో అవసరమని మార్కెట్ నిపుణులు కూడా పేర్కొన్నారు. వాల్‌మార్ట్ కొనుగోలుతో ఫ్లిప్‌కార్ట్ గ్లోబల్ జర్నీ ప్రారంభమైందని, ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్లో చోటు చేసుకున్న ఈ కొనుగోలు, టెలికాం మార్కెట్ కొనుగోలు లాంటిది కాదని పీపుల్‌స్ట్రాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంకజ్ బన్సాల్ అన్నారు. ఆన్లైన్ పరంగా ఫ్లిప్‌కార్ట్‌కు బలమైన టెక్నాలజీ ఉందని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివే అన్నారు. -
మూడింతలైన కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కార్పొరేట్ ఇండియాలో కరోడ్‌పతి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకునే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 422 నుంచి 2017లో ఏకంగా 1,172 మందికి పెరిగింది. కాపిటాలైన్ ఇతర వార్షిక నివేదికల గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. బడా కంపెనీలు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించడం, లాభాలు పెరగడంతో పలు మధ్యస్ధాయి కంపెనీల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పలువురు ప్రమోట్ కావడంతో కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య పెరిగింది. బీఎస్ఈ 200 గ్రూప్‌లో ప్రతి కంపెనీలో సగటున రూ 5.5 కోట్ల ప్యాకేజ్‌తో ఐదుగురు కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ 5000 కోట్లు (నికర లాభంలో 1.1 శాతం) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలకు వెచ్చించాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ కోటికి పైగా వేతనం అందుకుంటున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా 105 కాగా, టీసీఎస్‌లో 91, భారతి ఎయిర్‌టెల్‌లో 82 మంది కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. -
భారీ ప్యాకేజీలతో ఎగ్జిక్యూటివ్‌లకు జాబ్ ఆఫర్స్
ముంబై : మీ సీవీకి కాస్త మెరుగులు దిద్దండి.. లింక్డిన్ పేజీలో అప్డేట్ చేసేయండి. ఎందుకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు స్టార్టప్‌లు గుడ్‌న్యూస్ అందిస్తున్నాయి. భారీ ప్యాకేజీలతో ఉద్యోగవకాశాలను ఆఫర్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల వేతనం, వేరియబుల్స్, స్టాక్ ఆప్షన్లతో సీనియర్ స్థాయి ఉద్యోగులకు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎమర్జింగ్ రంగంలో వచ్చే కొన్ని నెలల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్లు పెరుగనున్నాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. అప్‌గ్రాడ్, సింప్లీలెర్న్, టాపర్, పియర్సన్, ఎమెరిటస్ వంటి కంపెనీలు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు పెంచాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అప్గ్రాడ్ను ప్రమోట్ చేస్తున్న ఎంటర్‌ప్రిన్యూర్ రోనీ స్క్రూవాలా ఇటీవలే నలుగురు సీనియర్ ఉద్యోగులను నియమించుకుంది. వారికి రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది. మరో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎమెరిటస్ కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ముగ్గురు ఉద్యోగులను నియమించుకుందని, వారికి కూడా భారీగా వేతనాలు ఆఫర్ చేసినట్టు రిపోర్టులు తెలిపాయి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్పేస్‌లో నిధులు 2014లో 101.7 మిలియన్ డాలర్లుండగా.. 2015లో 126.4 మిలియన్ డాలర్లు, 2016లో 186.1 మిలియన్ డాలర్లకు పెరిగిందని ట్రాక్షన్ డేటా తెలిపింది. స్టార్టప్‌ల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్యోగాల ఆఫర్‌తో పాటు బ్యాంకింగ్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఈకామర్స్ వంటి రంగాల్లో డేటా అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ఉద్యోగాలు ఉండనున్నాయని తెలిసింది. -
సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు టార్గెట్, నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్లాక్‌మనీ హోల్డర్స్పై కొరడా ఝళిపిస్తూ వెళ్తున్న ఆదాయపు పన్ను శాఖ అథారిటీలు తాజాగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను టార్గెట్ చేశారు. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు కలిగిన వారికి విచారణ నోటీసులు పంపుతున్నారు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ కింద అమెరికా, భారత్‌తో వీరి సమాచారాన్ని షేర్ చేస్తోంది. ఈ లేఖలు అందిన వారిలో బహుళ జాతీయ కంపెన్లీ పనిచేస్తూ కొన్ని ఏళ్ల క్రితం భారత్‌కు వచ్చిన టాప్-ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌లున్నారు. అమెరికా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డివిడెంట్లపై వివరణ ఇవ్వాలని వీరిని, ఆదాయపు పన్ను శాఖ ఆదేశిస్తోంది. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు మాత్రమే కాక, ఫైనాన్సియల్‌గా కలిగి ఉన్న వాటిపై కూడా వివరణ ఇవ్వాలని కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపింది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా 2015 సెప్టెంబర్ నుంచే భారత్, అమెరికాతో సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ పంపుతున్న నోటీసుల్లో బ్యాంకు అకౌంట్లో కలిగి ఉన్న డివిడెండ్లు, ఆదాయంపై వడ్డీ, ఇతర డిపాజిట్లపై సమాచారం కోరుతున్నట్టు తెలిసింది. అయితే ఎంతమందికి ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపిందో తెలియదు. విదేశాల్లో సంపదను కలిగి ఉండి, వాటిని దాచిపెడితే లెక్కల్లో చూపని విదేశీ ఆదాయం, ఆస్తుల యాక్ట్ కింద 10 ఏళ్ల వరకు కఠిన శిక్ష ఉంటుంది. 120 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా పొందిన సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాథమికంగా ఫిల్డర్‌చేసి, ప్రాసెస్ చేపడుతోంది. -
కాగ్నిజెంట్: 400 మంది టెకీలకు ఉద్వాసన
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఎస్పీ) పథకానికి వీరు అంగీకారం తెలిపారని కాగ్నిజెంట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. వీఎస్‌పీకి ఆమోదం తెలిపిన 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఎక్కువ మంది భారత ఉద్యోగులేనని భావిస్తున్నారు. ఈ ఆఫర్‌ను అంగీకరించిన వారిలో భారత ఎగ్జిక్యూటివ్‌లు ఎంత మంది ఉన్నారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలుగుతుండటంతో కంపెనీకి ఏటా 60 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లీన్ పేర్కొనడం గమనార్హం. ఉద్యోగులపై వేటుతో కంపెనీ లాభాలు మెరుగుపడతాయని వ్యాఖ్యానించారు. సామర్థ్య మదింపు, వీఎస్పీ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల నిష్ర్కమణ రేటు అత్యధికంగా ఉందని చెప్పారు. -
ఇలా చేస్తే ఉద్యోగాల కోతకు చెక్
బెంగళూరు : దేశీయ ఐటీ పరిశ్రమ ఇటీవల ఉద్యోగాల కోతతో తీవ్రంగా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ వీసా విధానాలు, ఆటోమేషన్, వ్యయాల భారం వంటి కారణాలతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. అయితే ఉద్యోగులపై వేటు వేయకుండా.. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ సలహా ఇచ్చారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాల్లో కోతపెడితే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చెప్పారు. భారతీయ ఐటీ పరిశ్రమ ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఐటీ పరిశ్రమ చాలాసార్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పరిశ్రమ నాయకులందరూ కలిసి మంచి ఉద్దేశ్యంతో ఈ సమస్యను పరిష్కరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తంచేశారు. '' ఇండస్ట్రీలో చాలామంది తెలివైన నాయకులున్నారు. వారందరికీ మంచి ఉద్డేశ్యాలే ఉన్నాయి. వారు పరిష్కారం కనుగొంటారు'' అని ఉద్యోగాల కోతపై ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉద్యోగుల తొలగింపు సమస్యను ఎదుర్కోవడం ఇదేమీ తొలిసారి కాదని, 2008, 2001లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా ఆందోళన చెందాల్సినవసరం లేదని, ఇలాంటి సమస్యలకు మన దగ్గర పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగానే లేఆఫ్స్ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ఓ ఉదాహరణతో వివరించారు. సీనియర్ యాజమాన్యం స్థాయి ఎగ్జిక్యూటివ్ లు వేతనాలు తగ్గిస్తే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని సూచించారు. 2001లో ఇన్ఫోసిస్ ఇదే పద్ధతిని అవలంభించిందని తెలిపారు. 2001లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో యువతరం ఉద్యోగాలను కాపాడేందుకు తమ వేతనాల్లో కొంత త్యాగం చేశామని చెప్పారు. సీనియర్ మేనేజ్ మెంట్ స్థాయిలో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగుల తొలగింపుపై మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా యువ ఉద్యోగులకు శిక్షణ శిబిరాలను నిర్వహించి.. నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పారు. అంతేతప్ప ఉద్యోగులను భయపెట్టడం మంచివిధానం కాదన్నారు.