![DGCA suspends two senior AirAsia India executives over safety issues - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/11/Air%20Asia.jpg.webp?itok=0Q4Ks_6U)
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. "భద్రతా ఉల్లంఘనలపై" సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు.
ఎయిర్ ఏషియాకు చెందిన మాజీ పైలట్, ప్రముఖ యూట్యూబర్ కెప్టెన్ గౌరవ్ తనేజా ఆరోపణలకు మేరకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. జూన్ లోనే వీరికి షోకాజ్ నోటీసుల జారీ చేశామనీ, ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ హెడ్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ నేమాను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించామని సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నతనేజా ఈ సంవత్సరం జూన్ లో ఎయిర్ ఏషియా ఇండియాపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనపై వేటు వేశారంటూ ఒక వీడియోను షేర్ చేసిన ఆయన విమానయాన సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపించారు. ప్రయాణీకుల క్షేమం కోసం మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారంటూ ఒక వివరణాత్మక వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇంధన ఆదా సాకుతో "ఫ్లాప్-3" మోడ్‌లో 98 శాతం ల్యాండింగ్‌లు చేయాలని పైలట్లపై ఒత్తిడి చేస్తోందని, అలా చేయని వారిని ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఉల్లంఘనగా పేర్కొంటోందని ఆరోపించారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సురక్షితమైంది కాదా, లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్లాప్-3 ల్యాండింగ్‌లు చేయమంటోందని, ఇది ప్రయాణీకుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ట్విటర్ లో దుమారం రూగింది. దీనిపై స్పందించిన డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించామనీ, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment