AirAsia India
-
ఎయిరిండియా చెంతకు రెండు ఎయిర్‌లైన్స్!
ముంబై: విమాన సర్వీసుల వ్యాపార విభాగాన్ని కన్సాలిడేట్ చేయడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియా కిందికి ఎయిర్ఏషియా ఇండియా, విస్తారలను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ ఆర్ఎస్ సంధూ సారథ్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా అలాగే ఎయిరిండియా, విస్తార కార్యకలాపాల మధ్య సారూప్యతలను ఈ టీమ్ మదింపు చేయనున్నట్లు తెలిపాయి. ఏడాది వ్యవధిలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్ఏషియా ఇండియాను కన్సాలిడేట్ చేయాలని, 2024 నాటికి మొత్తం విమాన సేవల వ్యాపారాన్ని ఎయిరిండియా గొడుగు కిందికి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం
ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాను కొద్ది రోజుల క్రితం టాటా సన్స్ కొనుగోలు చేసిన సంగతి తేలిసిందే. టాటా సన్స్‌కు దీనితో పాటు విస్తారా, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలలో వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియాఎక్స్‌ప్రెస్‌ను తమకు 84 శాతం వాటా కలిగిన ఎయిర్ ఆసియా ఇండియాతో విలీనం చేయాలని టాటా సన్స్ చూస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునే సమయం దగ్గర పడటంతో కార్యాచరణ ఖర్చులను తగ్గించాలని చూస్తోంది. విస్తారా, ఎయిర్ ఇండియాను కలిపి వేయడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఎ)తో టాటా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. విస్తారాలో టాటాకు 51శాతం వాటం ఉండగా, మిగతా వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉంది. మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. సిబ్బంది ఏకీకరణ, విమానాల నాణ్యత, భద్రతా తనిఖీల గురించి చర్చించడానికి టాటా సన్స్ కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా సీనియర్ మేనేజ్ మెంట్ తో అనేక సమావేశాలు నిర్వహించింది. ఒకే విధంగా కార్యకలాపాలు కొనసాగించే సంస్థలను విలీనం చేయడం వల్ల ఇబ్బందులు రావని, పైగా వ్యయాలు తగ్గుతాయని టాటా సన్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియాలు రెండూ చౌక విమానయాన సంస్థలే. యాజమాన్య వాటాల దృష్ట్యా చూసినా, వీటిని ఒకే సంస్థగా మార్చడం టాటా సన్స్‌కు సులభమే అని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి 4 రోజులే పని..!) -
విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఇటాలియన్ స్మూచ్ ఇవ్వనందుకు ఓ ప్రయాణికుడు విమానంలో బట్టలిప్పి మరీ రచ్చ చేశాడు. విమాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తోన్న ఎయిర్ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి లైఫ్ జాకెట్ ఇవ్వాలంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపటికి క్రూ దగ్గరకి వెళ్లి తనకు ఇటాలియన్ స్మూచ్ కావాలి అని అడిగాడు. వారు లేదని చెప్పడంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు తన ల్యాప్‌టాప్ విసిరి కొట్టాడు. తరువాత ఒంటి మీద బట్టలు విప్పుకుని.. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి.. తనకు దుస్తులు వేయాల్సిందిగా కోరాడు. లేదంటే ముద్దిమ్మని అడిగాడు. సదరు ప్యాసింజర్ బిత్తిరి చర్యలకు మిగతా ప్రయాణికలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా మరోసారి బట్టలిప్పి రచ్చ చేశాడు. సిబ్బంది ఎలాగో కష్టపడి అతడికి దుస్తులు తొడిగి సీట్లో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అతడిని అప్పగించారు. విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు గాను అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి వింత ప్రవర్తన చూసిన మిగతా ప్రయాణికులు అతడు డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! -
ఎయిర్ఏషియాలో టాటాకు 51 శాతం వాటా?
ముంబై, సాక్షి: భాగస్వామ్య సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో కంపెనీకి అత్యవసర ప్రాతిపదికన టటా గ్రూప్ 5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 375 కోట్లు)ను అందించనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఈక్విటీ, రుణాల రూపంలో ఈ నిధులను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎయిర్ఏషియాలో టాటా గ్రూప్ వాటా 51 శాతం ఎగువకు చేరే వీలున్నట్లు పేర్కొన్నాయి. ఎయిర్ఏషియా గ్రూప్‌నకు మలేసియన్ భాగస్వామ్య సంస్థ నిధులను సమకూర్చడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. భాగస్వామి కోసం ఎయిర్ఏషియా నుంచి మలేషియన్ భాగస్వామి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్ఏషియాలో కొనసాగేందుకే టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ఏషియాకు భవిష్యత్‌లో పెట్టుబడులను సమకూర్చగల భాగస్వామి కోసం టాటా గ్రూప్ చూస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా విమానయాన రంగానికి సంబంధించి కోవిడ్-19ను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులకు అనుగుణంగా టాటా గ్రూప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించాయి. వెరసి మధ్యకాలానికి తిరిగి దేశీ విమానయాన రంగం జోరందుకోనున్నట్లు టాటా గ్రూప్ భావిస్తోంది. అవకాశాలు.. దేశీయంగా చౌక ధరల విమానయానానికి పలు అవకాశాలున్నట్లు టాటా గ్రూప్ అంచనా వేస్తోంది. 30 ఎయిర్‌బస్ A320 విమానాలను కలిగి ఉన్న కంపెనీలో 2,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. 600 మంది పైలట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. 2014లో ప్రారంభమైన కంపెనీ ఇంతవరకూ లాభాలు ఆర్జించకపోవడం గమనార్హం! కాగా.. మరోపక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిపి టాటా గ్రూప్ విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. విస్తారాలో టాటా గ్రూప్ 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 49 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలూ విస్తారాకు ఇటీవల రూ. 585 కోట్ల నిధులను అందజేశాయి. -
ఎయిర్ ఏషియాకు షాకిచ్చిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. "భద్రతా ఉల్లంఘనలపై" సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మాజీ పైలట్, ప్రముఖ యూట్యూబర్ కెప్టెన్ గౌరవ్ తనేజా ఆరోపణలకు మేరకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. జూన్ లోనే వీరికి షోకాజ్ నోటీసుల జారీ చేశామనీ, ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ హెడ్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ నేమాను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించామని సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నతనేజా ఈ సంవత్సరం జూన్ లో ఎయిర్ ఏషియా ఇండియాపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనపై వేటు వేశారంటూ ఒక వీడియోను షేర్ చేసిన ఆయన విమానయాన సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపించారు. ప్రయాణీకుల క్షేమం కోసం మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారంటూ ఒక వివరణాత్మక వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇంధన ఆదా సాకుతో "ఫ్లాప్-3" మోడ్‌లో 98 శాతం ల్యాండింగ్‌లు చేయాలని పైలట్లపై ఒత్తిడి చేస్తోందని, అలా చేయని వారిని ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఉల్లంఘనగా పేర్కొంటోందని ఆరోపించారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సురక్షితమైంది కాదా, లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్లాప్-3 ల్యాండింగ్‌లు చేయమంటోందని, ఇది ప్రయాణీకుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ట్విటర్ లో దుమారం రూగింది. దీనిపై స్పందించిన డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించామనీ, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఎయిరేషియా ఇండియా విమాన టికెట్లపై 20 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. తమ విమాన సర్వీసులపైనా, ఎయిర్ఏషియా నెట్వర్క్ విమాన సర్వీసుల్లోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిరేషియా ఇండియా తెలిపింది. ఈ ఆఫర్లకు సంబంధించిన బుకింగ్స్ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని, ఈ నెల 25 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ భాస్కరన్ తెలిపారు. ఈ డిస్కౌంట్ టికెట్లతో ఈ నెల 25 నుంచి జూలై 31 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. ఎయిర్ఏషియా అంతర్జాతీయ రూట్లలో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన టాటా గ్రూప్, మలేషియాకు చెందిన ఎయిరేషియా కలసి ఎయిర్ఏషియా ఇండియా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ 19 దేశీయ రూట్లలో, 20 ఎయిర్‌బస్ ఏ320లతో విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. కాగా,వెబ్సైట్ ద్వారాగానీ లేక యాప్‌ద్వారాకానీ టికెట్లను బుక్ చేసుకోవని ఎయిర్ఏషియా ఒక ప్రకటలో తెలిపింది. -
ఎయిర్ఏషియా ఇయర్ఎండ్ ఆఫర్స్
న్యూఢిల్లీ: ఎయిర్ఏషియా ఇండియా సంవత్సరం ముగింపు సందర్భంగా హాలిడే ఆఫర్లను ప్రకటించింది. దేశీ ప్రయాణానికి ప్రారంభ టిక్కెట్ ధర రూ. 1299 కాగా విదేశీ ప్రయాణానికి రూ.2,399 గా నిర్ణయించింది. కౌలాలంపూర్, బాలి, బ్యాంకాక్, మెల్బోర్న్, సిడ్నీ, సింగపూర్, అక్లాండ్‌తో సహ 120 దేశాల్లో చౌకధరపై విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అక్టోబర్ 15 వరకు మాత్రమే టికెట్ల అమ్మకం ఉంటుందని, మార్చి 31 తేదీ లోపు ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. -
ఎయిర్ఏసియాకు టాప్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఏసియా టాప్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణను భారీగా ఎదుర్కొంటుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు ఛాండిల్య గతేడాది తన పదవి నుంచి తప్పుకున్నాక, ఇటీవల సీఎఫ్ఓ అరుణ్ ఖన్నాతో పాటు మరో ఐదుగురు కార్యవర్గ అధినేతలు తమ రాజీనామా పత్రాలను సమర్పించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వీరిలో మానవ వనరుల విభాగానికి చెందిన అధినేతకు రాజీనామా చేయాలని ఆదేశాలు వచ్చినట్టు ఈ విషయం తెలిసిన ఒక అధికారి చెప్పారు. మరో నలుగురిలో నవ్‌దీప్ లంబ(సెక్యురిటీ అధినేత), విధు నాయర్(ఆన్సిలరీ, కార్గో అధినేత), నంత కుమార్(ఇంజనీరింగ్ అధినేత), జీ సంపత్(ఇంజనీరింగ్ డైరెక్టర్)లు ఉన్నారు. ఈ ఐదుగురిలో లంబ, నాయర్ ఈ విమానయాన సంస్థలో చేరిన ఆరు నెలల వ్యవధిలోనే ఎయిర్ఏసియాకు గుడ్‌బై చెప్పారు. దీనిపై స్పందించడానికి ఎయిర్ఏసియా ఇండియా అధికార ప్రతినిధి నిరాకరించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్ అబ్రోల్ కుడా కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందిచడం లేదు. ఎయిర్ఏసియా ఇండియా మానవ వనరుల విభాగానికి తర్వాత రాబోతున్న అధినేత, టాటా గ్రూప్ అధికారి అయి ఉండాడని మరో వ్యక్తి చెప్పారు. టాటా సన్స్‌కు, మలేషియాకు చెందిన ఎయిర్ఏసియా బెర్హాడ్‌కు ఇది జాయింట్ వెంచర్. -
ఏయిర్ ఏసియా బంపర్ డిస్కౌంట్
న్యూఢిల్లీ : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్పులకు(వెళ్లడం, రావడం) 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలంటే కంపెనీ వెబ్సైట్, మొబైల్ ఆధారిత తమ అప్లికేషన్లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఏయిర్ఏసియా పేర్కొంది. 2017 జనవరి 23 నుంచి 29 వరకు ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ లేదా ఏయిర్ఏసియా.కామ్‌లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణాలకు ఇది వర్తించనుంది. ఏయిర్ఏసియా ఇండియా విమానాలు తిరిగే అన్ని విమానాలకు, అన్ని మార్గాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కంపెనీ విమానాలు నడపబోతున్న శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఇది వర్తించనుందని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 19 నుంచి శ్రీనగర్, బాగ్దోగ్రాలకు ఎయిర్‌లైన్ విమానాలు నడుపనుంది. బెంగళూరు, న్యూఢిల్లీ రెండు హబ్‌లుగా 11 ప్రాంతాలకు ఈ ఎయిర్‌లైన్ తన సర్వీసులను అందిస్తోంది. -
‘కబాలి’ కోసం నెలరోజులు కష్టపడ్డాం!
‘కబాలి’ విమానం కోసం నెల శ్రమించాం దేశమంతా ‘కబాలి’ ఫీవర్ ఊపేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ‘కబాలి’ని చూసేందుకు రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందడిని మరింత పెంచుతూ తాజాగా ఎయిర్ ఆసియా ఇండియా విమానాయాన సంస్థ ఏకంగా ఓ ప్రత్యేక కబాలి విమానాన్ని ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే. రజనీ స్టైల్లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం శుక్రవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుంది. ఓ హీరో గౌరవార్థం విమానాన్ని ప్రత్యేకంగా ముస్తాబుచేయడం ఆసియాలో ఇదే తొలిసారి అని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ తెలిపింది. ‘కబాలి’ సినిమాకు ఈ సంస్థ అధికారిక ఎయిర్ లైన్ భాగస్వామిగా ఉంది. ఎయిర్ ఆసియా ఇండియా విమానంలో కబాలి సన్నివేశాలు కొన్నింటిని చిత్రీకరించారు కూడా.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ప్యాసింజర్ విమానాన్ని ‘కబాలి’ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దామని, సినిమా విడుదలైన తర్వాత ఈ విమానం కొనసాగుతుందని, రజనీ గౌరవార్థం, అంతర్జాతీయంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ కోసం దీనిని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఎయిర్ బస్ ఏ-320 విమానాన్ని ‘కబాలి’ లుక్ తో రీబ్రాండ్ చేయడానికి నెలరోజులు సమయం పట్టిందని, ఓ వ్యక్తి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ’కబాలి’ విమానాన్ని అందంగా తీర్చిదిద్దాడని చెప్పారు. -
ఎయిర్ ఏషియా ఇండియాకు అరుణ్ భాటియా గుడ్ బై
♦ అరుణ్ వాటాను కొంటున్న టాటా సన్స్ ♦ 49%కి పెరగనున్న టాటా వాటా న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలిగారు. ఎయిర్ఏషియా ఇండియాలో అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ కంపెనీకి దాదాపు 10 శాతం వాటా ఉంది. దీంట్లో టాటా సన్స్ సంస్థ 7.94 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. మిగిలిన వాటాను ఎయిర్ ఏషియా ఇండియా చైర్మన్ రామదొరై 0.5 శాతం వాటాను, కంపెనీ డెరైక్టర్ ఆర్. వెంకటరమణన్ 1.5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు. అరుణ్ భాటియా వాటా కొనుగోలుతో టాటా సన్స్ వాటా 41.06 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. ఈ డీల్ ఈ నెల 14న జరిగిందని, వచ్చే నెలలో పూర్తవుతుందని అంచనా. కాగా మలేషియా ఎయిర్ఏషియా బెర్హాద్‌కు ఎయిర్ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉంది. అరుణ్ భాటియా అసంతృప్తి చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా వ్యవహారాల పట్ల అరుణ్ భాటియా గత ఏడాది డిసెంబర్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విమానయాన సంస్థపై నియంత్రణ, యాజమాన్యహక్కుల విషయంలో విభేదాల నేప థ్యంలో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలుగుతున్నారని సమాచారం. గత నెలలో ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓగా మిట్టు చాండిల్య స్థానంలో అమర్ అబ్రాల్ నియామకం జరిగింది. వచ్చే నెల 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నది. ఎయిర్ ఏషియా ఇండియా పట్ల టాటా గ్రూప్‌కు అపారమైన నమ్మకం ఉందని, అందుకే వారు వాటా పెంచుకున్నారని, ఇది గొప్ప విషయమని ఏయిర్‌ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది.ఆరు విమానాలతో 12 రూట్లలో 18 లక్షల మంది ప్రయాణికులకు విమాన సర్వీసులను అందిస్తోంది. -
రూ. 1590కే విమాన టికెట్లు
దసరా, సంక్రాంతి సీజన్లలో ఇళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు దొరకడం లేదా? అయినా ఏమీ ఆందోళన అక్కర్లేదు. హాయిగా విమానం ఎక్కి మరీ వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 20వ తేదీ.. అంటే మంగళవారం నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్లకు ఎయిర్ ఏషియా ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ ఒకటో తేదీలోగా టికెట్లు బుక్ చేసుకుంటే, పన్నులన్నీ కలిపి కనిష్ఠంగా రూ. 1590కే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కొచ్చి, గోవా మార్గాల్లో వెళ్లడానికి రూ. 1590, అదే బెంగళూరు నుంచి పుణె అయితే రూ. 1990 ధర పెట్టిన ఎయిర్ ఏషియా, ఢిల్లీ- బెంగళూరు మార్గంలో మాత్రం రూ. 4290గా టికెట్ ధర నిర్ణయించింది. ఢిల్లీ-గోవా మార్గంలో రూ. 3990, గువాహటి -ఇంఫాల్ మార్గంలోను, ఢిల్లీ-గువాహటి మార్గంలోను రూ. 1690కి టికెట్లు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీలోగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి. వచ్చే ఏడాది ప్రయాణం మరింత చౌక ఎయిర్ ఏషియా విమానాల్లో వచ్చే సంవత్సరం వేసవి నుంచి ప్రయాణాలు మరింత చవగ్గా చేయొచ్చు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అక్టోబర్ 29 వరకు చేసే ప్రయాణాలకు కనిష్ఠ ధర రూ. 1299 అని ప్రకటించారు. ఈ ఆఫర్ కింద టికెట్లను మాత్రం అక్టోబర్ 25లోగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలు పండుగ సీజన్లు కాబట్టి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకోడానికి స్పైస్‌జెట్ సంస్థ అర్ధరాత్రి ప్రయాణాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరహా విమాన సర్వీసులు ప్రధానంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జెట్ ఎయిర్వేస్, ఇండిగో కూడా ఇలాంటి విమాన సర్వీసులను ప్రకటించాయి. -
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
బెంగళూరు: ఎయిర్ ఏషియా ఇండియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని చార్జీలతో సహా విమాన టిక్కెట్‌ను 799 రూపాయలకే విక్రయిస్తోంది. ఈ 'బిగ్ సేల్' ఆఫర్ ఈ నెల 28 వరకు మాత్రమే ఉంటుంది. కాగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 2016 ఫిబ్రవరి 15, 2016 ఆగస్టు 31 మధ్య ప్రయాణించాలి. బెంగళూరు నుంచి కోచికి విమాన టిక్కెట్ ధర 799 రూపాయలు. ఇక బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖపట్నం టిక్కెట్ ధరలను 999 రూపాయలుగా నిర్ణయించారు. బెంగళూరు-ఢిల్లీ విమాన టిక్కెట్ ధర 1999 రూపాయలు. పలు విమానయాన సంస్థలు ప్రయాణకులను ఆకర్షించేందుకు కోసం ఆఫర్లను ప్రకటించాయి. ఇటీవల ఎయిరిండియా ప్రమోషనల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 1777 రూపాయల నుంచి టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచింది. ఇతర విమానయాన సంస్థుల ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి. -
రూ. 990కే విమాన టికెట్
చెన్నై: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా దేశీ విమానయాన రంగంలో చార్జీలపరమైన పోరుకు తెరతీసింది. బెంగళూరు-గోవా రూట్లో రూ. 990కే(పన్నులతో సహా) టికెట్ ఆఫర్ చేస్తోంది. జూన్ 12 నుంచి ఎయిర్ఏషియా ఇండియా తమ ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఫ్లయిట్ సర్వీసు కోసం ఏ320 విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సీఈవో మిట్టు చాండిల్య తెలిపారు. బెంగళూరు నుంచి గోవాకు సాయంత్రం 3 గంటలకు విమానం బైల్దేరుతుందని, అలాగే తిరుగుప్రయాణంలో గోవా నుంచి సాయంత్రం ఆరు గంటలకు బైల్దేరుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం బెంగ ళూరు-గోవా రూట్లో వన్ వే చార్జీ సుమారు రూ. 5,000గా ఉంది. ఇప్పటికే స్పైస్‌జెట్, ఇండిగో వంటి చౌక చార్జీల విమానయాన సంస్థలు పలుమార్లు డిస్కౌంటు ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మిగతా కంపెనీలు విమాన చార్జీలు మరింత తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ, ఇలా చేయడం వల్ల సంస్థలు తమ ఖర్చులను క్రమబద్ధీకరించుకోవచ్చని భావిస్తున్నట్లు చాండిల్య పేర్కొన్నారు. టాటా సన్స్, వ్యాపారవేత్త అరుణ్ భాటియాకి చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా కలసి ఎయిర్ఏషియా ఇండియా ప్రారంభించాయి. కనీసం 60% సీట్ల భర్తీపై దృష్టి.. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై నుంచి సేవలు నిర్వహించే యోచనేది లేదని చాండిల్య స్పష్టం చేశారు. చెన్నైలో హబ్‌ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. బెంగళూరు-గోవా రూట్లో సర్వీసులు ప్రారంభించడం గురించి వివరిస్తూ.. ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మద్దతివ్వడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. 100 శాతం లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)ని తాము కోరుకుంటున్నామని, కనీసం 60 శాతంగా ఉన్నా సహేతుకంగా ఉన్నట్లే భావించవచ్చని ఆయన తెలిపారు. విస్తరణ విషయానికొస్తే .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది విమానాలతో దేశవ్యాప్తంగా పది నగరాలకు సర్వీసులు నడపాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఆయా నగరాల పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. కార్యకలాపాల నిర్వహణకు కావాల్సినన్ని నిధులు తమ దగ్గర ఉన్నాయని చాండిల్య తెలిపారు. సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. నాలుగు నెలల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా ఏవియేషన్ రంగంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన అడ్డంకిగా ఉందని, ఏ320 విమానాలు నడిపేందుకు అనువైన ఎయిర్‌పోర్టులు మరిన్ని రావాలని చాండిల్య చెప్పారు.