రూ. 990కే విమాన టికెట్
చెన్నై: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా దేశీ విమానయాన రంగంలో చార్జీలపరమైన పోరుకు తెరతీసింది. బెంగళూరు-గోవా రూట్లో రూ. 990కే(పన్నులతో సహా) టికెట్ ఆఫర్ చేస్తోంది. జూన్ 12 నుంచి ఎయిర్‌ఏషియా ఇండియా తమ ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఫ్లయిట్ సర్వీసు కోసం ఏ320 విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సీఈవో మిట్టు చాండిల్య తెలిపారు. బెంగళూరు నుంచి గోవాకు సాయంత్రం 3 గంటలకు విమానం బైల్దేరుతుందని, అలాగే తిరుగుప్రయాణంలో గోవా నుంచి సాయంత్రం ఆరు గంటలకు బైల్దేరుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం బెంగ ళూరు-గోవా రూట్లో వన్ వే చార్జీ సుమారు రూ. 5,000గా ఉంది. ఇప్పటికే స్పైస్‌జెట్, ఇండిగో వంటి చౌక చార్జీల విమానయాన సంస్థలు పలుమార్లు డిస్కౌంటు ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మిగతా కంపెనీలు విమాన చార్జీలు మరింత తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ, ఇలా చేయడం వల్ల సంస్థలు తమ ఖర్చులను క్రమబద్ధీకరించుకోవచ్చని భావిస్తున్నట్లు చాండిల్య పేర్కొన్నారు. టాటా సన్స్, వ్యాపారవేత్త అరుణ్ భాటియాకి చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియా కలసి ఎయిర్‌ఏషియా ఇండియా ప్రారంభించాయి.
కనీసం 60% సీట్ల భర్తీపై దృష్టి..
ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై నుంచి సేవలు నిర్వహించే యోచనేది లేదని చాండిల్య స్పష్టం చేశారు. చెన్నైలో హబ్‌ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. బెంగళూరు-గోవా రూట్లో సర్వీసులు ప్రారంభించడం గురించి వివరిస్తూ.. ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మద్దతివ్వడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. 100 శాతం లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)ని తాము కోరుకుంటున్నామని, కనీసం 60 శాతంగా ఉన్నా సహేతుకంగా ఉన్నట్లే భావించవచ్చని ఆయన తెలిపారు.
విస్తరణ విషయానికొస్తే .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది విమానాలతో దేశవ్యాప్తంగా పది నగరాలకు సర్వీసులు నడపాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఆయా నగరాల పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. కార్యకలాపాల నిర్వహణకు కావాల్సినన్ని నిధులు తమ దగ్గర ఉన్నాయని చాండిల్య తెలిపారు. సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. నాలుగు నెలల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా ఏవియేషన్ రంగంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన అడ్డంకిగా ఉందని, ఏ320 విమానాలు నడిపేందుకు అనువైన ఎయిర్‌పోర్టులు మరిన్ని రావాలని చాండిల్య చెప్పారు.