టాటా స్టీల్ సీనియర్ మేనేజర్ అర్నిదం పాల్ (ఫైల్ ఫోటో)
ఫరీదాబాద్: టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్నిదం పాల్ (35) దారుణ హత్యకు గురయ్యారు. కంపెనీ గిడ్డంగిలోనే నవంబర్ 9వ తేదీ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంస్థ మాజీ ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఉద్యోగి విశ్వాష్ పాండే(32) ఆఫీసు మెయిన్ గేటునుంచి ఆఫీసులోకి ఎంటర్ అయ్యి, నేరుగా సీనియర్ మేనేజర్ పాల్ క్యాబిన్‌లోకి చొరబడ్డాడు. అతిసమీపం నుంచి పొట్టలో ఐదుసార్లు కాల్పులు జరిపి మరోగేటు నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాండేను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.
కోలకతాకు చెందిన పాల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు ఇంకా పరారీలోఉన్నాడు.
మరోవైపు నిందితుడు 2015లో టాటాస్టీల్ ప్రోసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీఎస్‌పీఎస్‌డీఎల్)లో ఉద్యోగంలో చేరాడు. అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2018, ఆగష్టులో తొలగించినట్టు టీఎస్‌పీఎస్‌డీఎల్ వెల్లడించింది. మృతుని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది.
నిందితుడు పాండే దూకుడుగా ఉండేవాడనీ, సహచరులు, ఇతర సీనియర్లతో తరచూ గొడవలు పడుతూ వుండేవాడని కంపెనీ ఇతర ఉద్యోగుల కథనం. మరోవైపు హతుడు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే సంస్థ అతడిని ఉద్యోగంనుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న పాండే ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment