హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్‌సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం.
ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్‌లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment