
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) రూ. 1,528 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 1,335 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14 శాతం అధికం. ఇక క్యూ3లో ఆదాయం రూ. 15,349 కోట్ల నుంచి సుమారు 41 శాతం వృద్ధి చెంది రూ. 21,654 కోట్లకు చేరింది. ఆటో విభాగం, ఫార్మ్ విభాగాలు మెరుగైన పనితీరు కొనసాగిస్తున్నాయని శుక్రవారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎంఅండ్‌ఎం ఎండీ అనీష్ షా చెప్పారు.
నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మహీంద్రా గ్రూప్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 2,677 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 23,594 కోట్ల నుంచి రూ. 30,620 కోట్లకు ఎగిసింది. కాగా, జహీరాబాద్ ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రానికి సంబంధించిన పనులు వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని జెజూరికర్ తెలిపారు. సుమారు రెండేళ్లలో యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాగలదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment