స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ అనగానే.. ఆహా! లక్షలు సంపాదించవచ్చని చాలామంది భావిస్తారు. అందులో పెట్టుబడి పెట్టేవారు ఒక్కరోజులోనే భారీగా లాభాలు రావాలని ఆశిస్తారు. దాంతో ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్(ఒకరోజులో స్టాక్స్ కొని అదేరోజు అమ్మడం)ను ఎంచుకుంటున్నారు. కానీ అలా ట్రేడింగ్ చేస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురు నష్టపోతున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం 2018–19తో పోలిస్తే 2022–23లో ఈక్విటీల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన వారి సంఖ్య ఏకంగా 300 శాతం పెరిగింది. వీరిలో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపు యువ ట్రేడర్లే ఉన్నారు.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభపడిన వారితో పోలిస్తే నష్టపోయిన ట్రేడర్లు సగటున అత్యధికంగా లావాదేవీలు చేశారు. వీరి లాభనష్టాల సరళిని విశ్లేషించడానికి సెబీ అధ్యయనం నిర్వహించింది. కరోనా మహమ్మారికి పూర్వం, తర్వాత ట్రెండ్స్‌ను పరిశీలించేందుకు 2018–19, 2019–20, 2022–23 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న రిస్క్‌ల గురించి ట్రేడర్లలో అవగాహన పెంచేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సెబీ భావిస్తోంది.
సెబీ ఇప్పటికే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) సెగ్మెంట్‌లో ట్రేడర్ల ధోరణులపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడింగ్ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని చెప్పింది. ఈ నష్ట పరిమాణం సగటున రూ.1.1 లక్షలుగా ఉందని తేలింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 7.1 లక్షలుగా ఉన్న ఎఫ్‌అండ్‌వో ట్రేడర్ల సంఖ్య 500 శాతం ఎగిసి 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 45.24 లక్షలకు పెరిగింది.
ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!
తాజా నివేదికలోని వివరాల ప్రకారం..ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లావాదేవీలు జరిపే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. 30 ఏళ్ల లోపు వయసున్న ఇంట్రాడే ట్రేడర్ల సంఖ్య 2018–19లో 18 శాతంగా ఉండగా 2022–23లో 48 శాతానికి పెరిగింది. 2022–23లో 71 శాతం మంది (ప్రతి పది మందిలో ఏడుగురు) ఇంట్రాడే ట్రేడర్లు నికరంగా నష్టపోయారు. తరచుగా ట్రేడింగ్ చేసి (ఏడాదికి 500 పైగా ట్రేడ్‌లు) నష్టపోయిన ట్రేడర్ల సంఖ్య 80 శాతం పెరిగింది. ట్రేడింగ్‌లో నష్టపోవడమే కాకుండా ఆ నష్టాల్లో దాదాపు సగభాగం (57 శాతం) ట్రేడింగ్ ఖర్చుల రూపంలో సమర్పించుకున్నారు. ఇక నష్టపోయిన వారిలో అత్యధికులు (76 శాతం) యువ ట్రేడర్లే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment