ముంబై: కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన 2020లోనూ కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు సంపద గడించారు. హరూన్ ఇండియా టాప్ 100 సంపన్న రియల్టర్ల జాబితా 2020లోకి కొత్తగా ఎనిమిది మంది వచ్చి చేరారు. ముఖ్యంగా దేశంలో అత్యంత సంపన్న రియల్టర్‌గా లోధా డెవలపర్స్ అధినేత (మాక్రోటెక్), బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా(ఎంపీ లోధా) నిలిచారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితా 2020 మంగళవారం విడుదలైంది.
దేశంలోని టాప్ 100 రియల్టర్ల సంపద 2019తో పోలిస్తే గతేడాది (2020) 26 శాతం పెరిగి రూ.3,48,660 కోట్లకు చేరుకుంది. సగటున చూస్తే ఒక్కొక్కరి తలసరి సంపద రూ.3,487 కోట్లు. 6,000 కంపెనీలను ఈ జాబితాలోకి హరూన్ పరిగణనలోకి తీసుకుంది. ఆదాయం, నికర విలువ ఆధారంగా టాప్-100 మంది సంపన్న రియల్టర్ల జాబితాను రూపొందించింది. దేశంలోని 15 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు.
విడిగా చూస్తే..
- 65 ఏళ్ల ఎంపీ లోధా, ఆయన కుటుంబ ఆస్తి ఏడాది కాలంలో 39 శాతం పెరిగి రూ.44,270 కోట్లకు విస్తరించింది. 2014 నుంచి 2020 మధ్య విక్రయాల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా
- లోధా డెవలపర్స్ నిలిచింది. స్థల విస్తీర్ణం పరంగా చూస్తే రెండో స్థానంలో ఉంది.
- డీఎల్‌ఎఫ్ (61) అధినేత రాజీవ్‌షా రూ.36,430 కోట్లతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. డీఎల్‌ఎఫ్ షేరు ర్యాలీ చేయడంతో ఆయన సంపద 45 శాతం వృద్ధి సాధించింది.
- చంద్రు రహేజా (80), కే రహేజా కుటుంబ సంపద 70 శాతం పెరిగి రూ.26,260 కోట్లకు చేరుకుంది. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచారు.
- ఎంబïసీ ఆఫీస్ పార్క్స్‌కు చెందిన జితేంద్ర వీర్వాణి రూ.23,220 కోట్ల సంపదతతో నాలుగో స్థానంలో ఉన్నారు.
- నిరంజన్ హిరనందాని రూ.20,600 కోట్లు (హిరనందాని కమ్యూనిటీస్), ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ (రూ.15,770 కోట్లు), రాజా బగ్మానే రూ.15,590 కోట్లు, రున్వాల్ డెవలపర్స్ సుభాష్ రున్వాల్ (రూ.11,450 కోట్లు), పిరమల్ రియల్టీ అధినేత అజయ్ పిరమల్ (రూ.5,560 కోట్లు), ఫోనిక్స్ మిల్స్ అధినేత అతుల్ రుయా రూ.6,340 కోట్లతో వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు.
హైదరాబాద్ నుంచి ఐదుగురు
హరూన్ సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల జాబితా 2020లో హైదరాబాద్ నుంచి ఐదుగురు కూడా ఉన్నారు. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అధినేతలు సీ వెంకటేశ్వర రెడ్డి రూ.5,230 కోట్లు, ఎస్ సుబ్రమణ్యం రెడ్డి రూ.5,180 కోట్ల సంపదతో అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో టాప్ డెవలపర్లుగా జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబ సంపద రూ.4,957 కోట్లుగా ఉంది. జాబితాలో జూపల్లి రామేశ్వరరావు 11వ స్థానంలో నిలిచారు.
మధ్య స్థాయి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లను నిర్మించే సంస్థల్లో మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ నంబర్1గా నిలిచింది. 12, 13వ స్థానాల్లో వరుసగా వెంకటేశ్వరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఉన్నారు. ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రాకు చెందిన జీవీరావు, ఆయన కుటుంబం రూ.1,010 కోట్ల నికర విలువతో 49వ స్థానంలో ఉండగా.. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం రూ.460 కోట్లతో 72వ ర్యాంకును దక్కించుకున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment