ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 వ్యాక్సిన్లు, సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రకటించనున్న ఫలితాలు నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి దేశీయంగానూ వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకానుండటంతో సెంటిమెంటు మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే యూఎస్, యూకే, కెనడా తదితర పలు దేశాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తయారీ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. దేశీయంగా ఆస్ట్రాజెనెకా తయారీ కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అందించనుంది. తొలి దశలో భాగంగా ప్రభుత్వం హెల్త్ వర్కర్లు తదితర ప్రధాన సిబ్బందికి వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తాజాగా పేర్కొన్నారు. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్)
శుక్రవారం
ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ శుక్రవారం(8న) అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఫలితాలు ప్రకటించనుంది. తద్వారా క్యూ3 ఫలితాల సీజన్‌కు జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. డిసెంబర్ నెలకు పీఎంఐ తయారీ రంగ గణాంకాలు సోమవారం(4న) వెల్లడికానున్నాయి. ఇటీవల ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టినట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. ఫిబ్రవరి నెలకు చమురు కోతల అమలుపై ఒపెక్ దేశాలు 4న సమావేశంకానున్నాయి. దీంతో ముడిచమురు ధరలపై ఈ ప్రభావం పడనుంది. ఇటీవల చమురు ధరలు బలపడటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. వెరసి చమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఎఫ్‌పీఐల ఎఫెక్ట్
2020లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లలో దాదాపు 23 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా నవంబర్‌లో 8.1 బిలియన్ డాలర్లు, డిసెంబర్‌లో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల ర్యాలీని చేస్తున్నాయి. సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయికి చేరువకాగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లు ఓవర్‌బాట్ స్థితికి చేరినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వచ్చే వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు అంచనా వేశారు. నిఫ్టీ 400 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని భావిస్తున్నారు. 14,200- 13,800 పాయింట్ల పరిధిలో సంచరించే వీలున్నట్లు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment