భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (MSIL) తన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్ట్రాటజీ 'ఈ ఫర్ మీ' (e For Me) ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా తీసుకురానుంది. ఇందులో భాగంగానే సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారా (e Vitara) ప్రారంభించనుంది.
కంపెనీ లాంచ్ చేయనున్న మారుతి గ్రాండ్ ఈ విటారా.. 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025' ((Bharat Mobility Global Auto Show 2025)) లో కనిపించనుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. దీని ఉత్పత్తిని సంస్థ తన గుజరాత్ ప్లాంట్‌లో 2025 మార్చి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది తరువాత మారుతి సుజుకి.. తన ఎలక్ట్రిక్ విటారాను యూరప్, జపాన్‌లలో కూడా ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇ ఫర్ మీ అనేది భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనలో ఒక గొప్ప క్షణాన్ని సూచిస్తుంది. మారుతి సుజుకి నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశానికి విశ్వసనీయ మొబిలిటీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, నేడు.. కస్టమర్‌ల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీకి విప్లవాత్మక విధానాన్ని పరిచయం చేస్తున్నామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు.
మారుతి ఈ విటారా
ప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటి వరకు కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి.. గ్రాండ్ విటారాను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు.
ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?
ఈ విటారా భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో భారత్‌లోకి అరంగేట్రం చేస్తుందని, కొంతకాలం తర్వాత దాని లాంచ్ అవుతుందని సమాచారం. కాజీ ఈ కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. ఈ కార్ల ఉత్పత్తి భారతదేశంలో జరిగినప్పటికీ.. ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతాయి. మారుతి సుజుకి న్యూఢిల్లీలోని భారత్ మండపం, హాల్ నంబర్ 5 వద్ద తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇది మాత్రమే కాకుండా.. సంస్థ డిజైర్, స్విఫ్ట్, ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బ్రెజ్జా వంటి లేటెస్ట్ మోడల్స్ కూడా ప్రదర్శించనుంది. రెండేళ్లకో సారి జరిగే ఈ ఆటో షోలో.. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందులో బీవైడీ వంటి చైనా కంపెనీలు, జపాన్, జర్మనీ కంపెనీలు.. భారతీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలన్నీ కనిపించనున్నాయి. వాహన ప్రేమికులను ఆకర్శించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment