
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.

దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.

చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్‌లో కూడా విస్తరించింది.

కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్‌లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.

ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment