ఏడాదికి రూ.3.5 కోట్ల వార్షిక వేతనం వచ్చే ఉద్యోగం వద్దనుకున్నాడో యువ ఇంజనీర్. కారణం ఏంటంటే ఆ జాబ్ అతనికి బోర్ కొట్టింది. అక్కడ పెద్దగా చేయడానికి ఏమీ లేదట. అందుకే కిక్కు కరువైన చోట ఉండలేనంటూ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. పోనీ వేరే ఎక్కడైనా జాబ్ వెతుకున్నాడా అంటే అదీ లేదట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.
క్రియేటివ్ పీపుల్‌కి సాహాసవంతులకు ఛాలెంజింగ్ లైఫ్ అంటేనే ఇష్టం. మూస పద్దతిలో పని చేసుకుపోవడానికి ఇష్టపడరు. కాసుల కంటే కిక్కుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఆ కోవలోకే వస్తాడు మైఖైల్ లిన్ అనే యువ ఇంజనీరు. అతని తల్లిదండ్రులు బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ అమెరికాకు వలస వచ్చారు. లిన్ సైతం వారి కలలకు తగ్గట్టే ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. కానీ అక్కడ జాబ్ శాటిస్‌ఫ్యాక‌్షన్ లేదంటూ జేబులు నింపే ఉద్యోగానికి జెల్ల కొట్టాడు. తాను ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశాడో చెబుతూ లింకెడ్‌ఇన్‌లో సవివరంగా తెలిపారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.
ఎంజాయ్ చేశా
మైఖేల్ లిన్ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. అంతుకు ముందు అతడు అమెజాన్‌లో పెద్ద స్థాయిలో పని చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన తర్వాత అక్కడ పని విధానం అర్థం చేసుకోవడం సంస్థ ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడంలో లిన్‌కో మజా దొరికేది. ఎంబీఏలో ఉన్నప్పుడు చేసే ప్రాజెక్టు వర్కుల తరహాలో ఎంతో ఉత్సాహాంగా నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన కొత్తలో పని చేసినట్టు లిన్ తెలిపాడు.
రూ.3.5 కోట్ల జీతం
నెట్‌ఫ్లిక్స్‌లో పని చేసే క్రమంలో తనకంటూ ఓ టీమ్, వాళ్లకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పడ్డాయి. అన్నింటా సక్సెస్ అయ్యారు. దీంతో లిన్ వార్షిక వేతనం ఏకంగా 4,50,000 డాలర్లకు (రూ. 3.5 కోట్లు) చేరుకుంది. కరోనా సమయంలో ప్రపంచమంతటా లాక్‌డౌన్ విధించడంతో ఒక్కసారిగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో మరింత మందికి నెట్‌ఫ్లిక్స్ దగ్గరయ్యేలా శ్రమించారు లిన్ అతని బృందం. అలా నెట్‌ఫ్లిక్స్‌లో ఓ ఇంజనీరుగా చేయాల్సిందతా చేశానంటున్నాడు లిన్.
కిక్కు పోయింది
కరోనా ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో జాబ్, లైఫ్ రెండు రోటీన్‌గా మారాయి అంటున్నాడు లిన్. రోజువారి కార్యక్రమాలతో ఉత్సహాం చచ్చిపోయింది అంటున్నాడు. అది తన పనితీరు మీద కూడా ప్రభావం చూపిందటున్నాడు. 2021 ఏప్రిల్‌లో తన పనితీరును మదింపు చేసుకున్న తర్వాత.. తాను మారాల్సి చాలా ఉందనే నిర్ణయానికి వచ్చాడు. కానీ పెద్ద జీతం కోసం కిక్కు కరువైన చోట పని చేయడం వేస్టని చివరకు డిసైడ్ అయ్యడు.
తలతిక్కనా?
జాబ్ బోరుకొడుతోందంటూ నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు మైఖేల్ లిన్. ఏడాదికి రూ. 3.5 కోట్ల జీతం ఉద్యోగం వదులుకుంటే ఎంత కష్టమో తెలిసినా తన నిర్ణయం మార్చుకోలేదు. కనీసం సేఫ్‌సైడ్‌గా వేరే చోటుకి రెజ్యూమ్ ఫార్వార్డ్ చేయడమో, ఇంటర్వ్యూలు ఇవ్వడమో చేయలేదు. 2021 మేలో రిజైన్ చేశాడు. అయితే అతను ఎందుకు రిజైన్ చేశాడో.. తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలియక అప్పట్లో నెట్‌ఫ్లిక్స్ పెద్దలు, అతని కొలీగ్స్ తలలు పట్టుకున్నారు.
సరికొత్త ఛాలెంజ్
నెట్‌ఫ్లిక్స్‌ను తాను విడిచి పెట్టేందుకు సంస్థ పరమైన కారణాలు ఏమీ లేవని. తనకు అక్కడ బోర్ కొట్టడం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తాజాగా లింక్‌డ్‌ఇన్ పోస్టులో లిన్ వెల్లడించాడు. ఇప్పుడు తనకంటూ కొత్తగా ఓ టీమ్‌ను రెడీ చేసుకున్నానని చెబుతున్నాడు. అతి త్వరలోనే ఉద్యోగిగా కాకుండా యజమానిగా కొత్త పాత్రలో సరికొత్త కిక్కును వెతుకుంటాను అని చెబుతున్నాడు లిన్.
Comments
Please login to add a commentAdd a comment