బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు! | Micro SUV sales boom | Sakshi
Sakshi News home page

బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు!

Published Thu, Oct 3 2024 3:27 AM | Last Updated on Thu, Oct 3 2024 8:04 AM

Micro SUV sales boom

అమ్మకాల్లో టాప్‌ గేరు...

దూసుకుపోతున్న టాటా పంచ్, హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ 

బ్రెజా, వెన్యూ, నెక్సాన్‌లకూ భారీ డిమాండ్‌

హ్యాచ్‌బ్యాక్స్‌ సేల్స్‌ తగ్గుముఖం

దేశంలో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీల) క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో  ఎస్‌యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అప్‌గ్రేడ్‌ అవుతుండటంలో  వాటి సేల్స్‌ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి.  మరోపక్క, చిన్న ఎస్‌యూవీల సెగ్మెంట్‌  తగ్గేదేలే అంటూ టాప్‌ గేర్‌లో  దూసుకుపోతోంది!  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్‌లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్‌యూవీలు దీనికి మినహాయింపు. హాట్‌ కేకుల్లా సేల్‌ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. 

రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్‌యూవీలకు డిమాండ్‌ ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్‌ ఎక్స్‌టర్, టాటా పంచ్‌ ఈ సెగ్మెంట్లో టాప్‌ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్‌–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. 

ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్‌యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్‌బ్యాక్స్‌ సేల్స్‌లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్‌యూవీల కేటగిరీలోకి ఎక్స్‌టర్, పంచ్‌తో పాటు కాంపాక్ట్‌ మోడల్స్‌ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. 

క్యూ కడుతున్న కంపెనీలు... 
ఈ సెగ్మెంట్‌ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్‌ తన తొలి మైక్రో ఎస్‌యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉండగా.. హ్యుందాయ్‌ మరో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘బేయాన్‌’తో మార్కెట్‌ షేర్‌ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. 

ఇక ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కైలాక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్‌లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల విభాగంలో పంచ్, ఎక్స్‌టర్‌ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్‌ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మారుతున్న ట్రెండ్‌... 
హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్‌యూవీల క్రేజ్‌ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్‌ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటు  ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. 

‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్‌వీయూల సెగ్మెంట్‌ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్‌టర్‌ వంటి చిన్న ఎస్‌యూవీలు కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్‌యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. 

నచి్చన ఫీచర్లు, డిజైన్‌ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు  వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్‌యూవీల సేల్స్‌ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్‌యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement