టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. డేటా సెంటర్ కోసం హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఓ స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పరంగా అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్దం అయినట్లు తెలుస్తుంది. త్వరలో దీని గురుంచి బహిరంగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బిజినెస్ స్టాండర్డ్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధిని సంప్రదించినప్పుడు ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ఇది గనుక వాస్తవరూపం దాల్చినట్లయితే తెలంగాణలో ఉపాది అవకాశాలు పెరగనున్నాయి. ఈ నెల ప్రారంభంలో పిల్లల దుస్తులలో నైపుణ్యం కలిగిన కేరళకు చెందిన కిటెక్స్ గ్రూప్ ప్రారంభంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసింది. జూన్ లో అమెరికాకు చెందిన ట్రిటన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2,100 కోట్ల పెట్టుబడితో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ 2019లో భారతదేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో భాగంగానే జియో నెట్‌వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ టెక్నాలజీ అయిన అజూర్ క్లౌడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కెనడాకు చెందినడిజిటల్ రియాల్టీ అనుబంధ సంస్థ బ్రూక్ ఫీల్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. బిఏఎమ్ రియాల్టీ బ్రాండ్ పేరుతో భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్ ను రూపొందించినట్లు తెలిపింది. 2024 కల్లా భారత్‌లో డేటా సెంటర్ల ఆదాయం 4 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment