మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో దీపావళి: విశ్లేషణ | Mid- Small caps may outperform in Diwali rally | Sakshi
Sakshi News home page

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో దీపావళి

Published Sat, Oct 24 2020 2:47 PM | Last Updated on Sat, Oct 24 2020 2:51 PM

Mid- Small caps may outperform in Diwali rally - Sakshi

దీపావళికి ముందు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగితే.. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగవచ్చని సీనియర్‌ సాంకేతిక నిపుణులు గౌరవ్‌ రత్నపార్ఖీ పేర్కొంటున్నారు. బీఎన్‌పీ పరిబాస్‌ ప్రమోట్‌ చేసిన షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌.. స్వల్ప కాలంలో మార్కెట్లను మించి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు పరుగుతీసే వీలున్నట్లు భావిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సాంకేతిక అంశాల ఆధారంగా మార్కెట్లపై అంచనాలను వెల్లడించారు. అంతేకాకుండా మూడు బ్లూచిప్‌ స్టాక్స్‌ను కొనుగోలుకి సిఫారసు చేశారు. వివరాలు చూద్దాం..

మెచూరీటికి దగ్గరగా..
గత వారం మార్కెట్లు స్వల్ప శ్రేణిలో సంచరించినప్పటికీ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 12,000 పాయింట్ల సమీపంలో స్థిరపడింది. గత నెల చివరి వారంలోనూ, ఈ నెల మొదట్లోనూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. వచ్చే వారం అక్టోబర్‌ డెరివేటివ్స్‌ గడువు ముగియనుండటం, యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. చార్టుల ప్రకారం ప్రస్తుతం నిఫ్టీ ట్రయాంగులర్‌ ప్యాటర్న్‌లోనే కనిపిస్తోంది. అంటే మెచూరిటీకి దగ్గరగా ఉన్నట్లు. దీంతో 12,025 స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే.. తదుపరి 12,200 వద్ద, ఆపై 12,430 వద్ద తిరిగి అవరోధాలు ఏర్పడవచ్చు. ఇదే విధంగా మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 11,800 వద్ద, తదుపరి 11,660 స్థాయిలో సపోర్ట్‌ లభించే వీలుంది.

కన్సాలిడేషన్‌లో
నిఫ్టీతో పోలిస్తే మిగిలిన ఇండెక్సులు దీర్ఘకాలిక కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. ఆగస్ట్‌- సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టం 11,794 పాయింట్లను నిఫ్టీ ఇప్పటికే అధిగమించింది. అయితే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ఇటీవల గరిష్టాలకంటే దిగువనే ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ స్ట్రక్చర్‌ ప్రకారం చూస్తే ఇకపై ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీలను మించి మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పరుగుతీసే అవకాశముంది. వెరసి దీపావళి ర్యాలీలో మార్కెట్లకంటే ముందుండే వీలుంది.

టెక్నికల్‌ స్టాక్స్‌..
చార్టుల ప్రకారం సాంకేతిక అంశాల ఆధారంగా ఈ వారం మూడు స్టాక్స్‌ కొనుగోలుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీటిని మూడు లేదా నాలుగు వారాలకు పరిశీలించవచ్చు. జాబితాలో ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ, ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్‌ డాబర్‌ ఇండియా, ఇండెక్స్‌ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ చోటు సాధించాయి. అయితే పొజిషన్లు తీసుకునే ఇన్వెస్టర్లు తప్పనిసరిగా స్టాప్‌లాస్‌లను అమలు చేయవలసి ఉంటుంది. 

మారుతీ సుజుకీ: కొనుగోలు చేయవచ్చు
గత కొద్ది సెషన్లుగా మారుతీ సుజుకీ కౌంటర్‌ స్వల్పకాలిక దిద్దుబాటు(కరెక్షన్‌)కు లోనయ్యింది. అయితే అత్యంత కీలకమైన రోజువారీ చలన సగటుల సమీపంలో మద్దతు లభించింది. తద్వారా గత సెషన్‌లో బౌన్స్‌బ్యాక్‌(ఫ్రెష్‌ మూవ్‌)ను సాధించింది. ఈ దశలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరగడం బుల్లిష్‌ ధోరణికి సంకేతంగా భావించవచ్చు.

23న ముగింపు: రూ. 7,108
టార్గెట్‌ ధర: రూ. 7,350- 7,600
స్టాప్‌లాస్‌: రూ. 6,830

డాబర్‌ ఇండియా: కొనుగోలు చేయవచ్చు
మధ్యకాలిక రైజింగ్‌ చానల్‌లో భాగంగా డాబర్‌ ఇండియా షేరు తాజాగా బలపడింది. ఇటీవలి క్షీణతతో చానల్‌ దిగువ భాగాన మద్దతును కూడగట్టుకుంది. వెరసి మద్దతు స్థాయిల సమీపంలో కదులుతోంది. తద్వారా పరుగు తీసేందుకు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది.

23న ముగింపు: రూ. 519
టార్గెట్‌ ధర: రూ. 535- 564
స్టాప్‌లాస్‌: రూ. 500

ఏషియన్‌ పెయింట్స్‌: కొనుగోలు చేయవచ్చు
గత కొన్ని సెషన్లలో స్వల్ప దిద్దుబాటు(కరెక్షన్‌) తదుపరి ఏషియన్‌ పెయింట్స్‌ స్పీడందుకుంది. ఈ జోరుతో ఇకపై మరింత ర్యాలీ చేసే అవకాశముంది. స్వల్ప, మధ్యకాలిక సంకేతాలు బుల్లిష్‌ ధోరణినే వ్యక్తం చేస్తున్నాయి. 

23న ముగింపు: రూ. 2,119
టార్గెట్‌ ధర: రూ. 2,185- 2,270
స్టాప్‌లాస్‌: రూ. 2,040

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement