దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. వారాంతానికల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటంతో శుక్రవారం ఒక్క రోజులోనే వ్యక్తిగత సంపదకు 3.5 బిలియన్ డాలర్లు జమకావడం ఇందుకు సహకరించింది. రెండు వారాల క్రితమే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన ముకేశ్ తాజాగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ అధినేత ఎలన్ మస్క్, గూగుల్ సహవ్యవస్థాపకులు సెర్జీ బ్రిన్, లారీ పేజ్‌లను సైతం వెనక్కి నెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు సరదాగా పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..
జియో ప్లాట్‌ఫామ్స్ స్పీడ్
గత నెలలో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10వ ర్యాంకులో నిలిచారు. తదుపరి గ్రూప్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో సాగడంతో వ్యక్తిగత సంపద మరింత బలపడుతూ వచ్చింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే ముకేశ్ సంపద 22.3 బిలియన్ డాలర్లు పెరిగింది. మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 145 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25 శాతం వాటా విక్రయం ద్వారా భారీగా విదేశీ నిధులను సమీకరించడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్‌ఐఎల్ నిలిచింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్, గూగుల్, సిల్వర్‌లేక్ తదితరాలు ఇన్వెస్ట్‌చేయడం ప్రస్తావించదగ్గ విషయంకాగా.. దీనికి జతగా ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలు ఇటీవల సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది అత్యంత భారీగా సంపదను పెంచుకున్న వ్యక్తులలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలవడం విశేషం! బెజోస్ సంపద 2020లో ఇప్పటివరకూ 64 బిలియన్ డాలర్లమేర బలపడింది!
Comments
Please login to add a commentAdd a comment