
ముంబై : ఆసియాలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల ఫోకస్ అంతా గ్రీన్ ఎనర్జీ మీద పెట్టారు. సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో ఒకరిని మించి మరొకరు లక్ష్యాలను నిర్థేశించుకున్నారు. భారీగా పెట్టుబడులకు సిద్ధం అవుతున్నారు.
తొలిసారి పోటీ
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరు గుజరాతీయులే. ఎప్పటి నుంచో వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే ఎప్పుడు వీరిద్దరు ఒకరికొకరు పోటీ కాలేదు. రిలయన్స్ ప్రధానంగా పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్ తదితర వినియోగదారులు టార్గెట్‌గా బిజినెస్ చేశారు. మరోవైపు అదాని పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా మౌలిక వసతుల కల్పన రంగంలో తమ వ్యాపారాలు కేంద్రీకరించారు. కానీ తొలిసారి వీరిద్దరికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో పోటీ ఎదురవుతోంది.
గ్రీన్‌పై అదాని
ముందు నుంచి మౌలిక వసతుల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూపు, గ్రీన్ ఎనర్జీపైనా అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది. 2030 నాటికి సోలార్ ఎనర్జీ ప్రొడక‌్షన్‌లో అదానీ గ్రూపును ప్రపంచలోనే నెంబర్ వన్‌గా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 25 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న వివిధ కంపెనీల్లో అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టింది. మరోవైపు నిధుల సమీకరణకు అదానీ గ్రీన్ ఎనర్జీలో 20 శాతం వాటను ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎనర్జీస్ ఎస్‌ఈ సంస్థకు కట్టబెట్టింది.
రిలయన్స్ ఫోకస్
టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అచ్చంగా అదే స్థాయిలో గ్రీన్ ఎనర్జీలో మార్పులు తెస్తామంటూ స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. అందుకు తగ్గట్టే గ్రీన్ ఎనర్జీపై ఏకంగా 75,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు.
ఆసక్తికర పోటీ
దేశంలో అప్పటి వరకు ఉన్న బడా వ్యాపార కుటుంబాలను, సంస్థలను వెనక్కి నెట్టి అనతి కాలంలోనే అంబానీ, అదానీలు దేశంలోనే సంపన్నులుగా మారారు. మార్కెట్‌ను సరిగా పసిగట్టి, అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించి ఘన విజయాలు సాధించారు. దారులు వేరైనా నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు కదిలారు. తొలిసారి వీరిద్దరు గ్రీన్ ఎనర్జీ రంగంలో పోటీ పడుతున్నారు. దీంతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో వీళ్ల వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
చదవండి : రిలయన్స్‌కు... కొత్త ‘ఇంధనం’
Comments
Please login to add a commentAdd a comment