![Mumbai ranked 4th in global residential price rise Knight Frank - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/3/residential-price-rise-mumbai.jpg.webp?itok=wGK4r864)
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నగరాలు ఉన్నాయి.
నైట్ ఫ్రాంక్ (Knight Frank) విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరం ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో నాలుగో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 6.5 శాతం పెరుగుదలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఉన్న 22వ ర్యాంక్ నుంచి ఈసారి 18 స్థానాలు ఎగబాకింది.
అలాగే న్యూ ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా తమ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలను నమోదు చేశాయి. న్యూ ఢిల్లీ ఎన్‌సీఆర్ 4.1 శాతం వృద్ధితో ఏడాది క్రితం 36వ ర్యాంక్ నుంచి ఈ ఏడాది 10వ స్థానానికి ఎగబాకిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. బెంగళూరు ర్యాంక్ గతేడాది 27 నుంచి ఈ ఏడాది 2.2 శాతం వృద్ధితో 17కి పెరిగింది.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 12 నెలల కాలంలో 46 మార్కెట్‌లలో వార్షిక ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సగటు పెరుగుదల 2.1 శాతంగా నమోదైంది. ఇది గతేడాది మూడో త్రైమాసికం నుంచి నమోదైన అత్యంత బలమైన వృద్ధి రేటు. మొత్తంగా 67 శాతం నగరాలలో ఇళ్ల ధరలు పెరుగుదలను నమోదు చేసినట్లుగా నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది.
టాప్‌లో మనీలా
ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా 21.2 శాతం వార్షిక ధరల పెరుగుదలతో ఈ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశ, విదేశీ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గత ఎనిమిది త్రైమాసికాల నుంచి వరుసగా అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న దుబాయ్ ఈసారి టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఈ ఏడాది కేవలం 15.9 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో శాన్‌ఫ్రాన్సిస్కో అట్టడుగున నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment