టెస్లా ఏజీఎంలో మస్క్ వ్యాఖ్యలు
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. సంస్థ వాటాదారుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో భాగంగా టెస్లా లీగల్ కార్యాలయాన్ని యూఎస్‌లోని డెలావర్ నుంచి టెక్సాస్‌కు మార్చేందుకు షేర్‌హోల్టర్లు అనుమతించారు.
టెస్లా ట్యాక్సీలు
ఏజీఎంలో మస్క్ మాట్లాడుతూ..‘టెస్లా యాజమానులకు మరింత విలువ జోడించేలా, కంపెనీ వల్ల తమ ఆదాయం పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్లా వినియోగదారులు తమ కార్లను ఉబర్, ఎయిర్‌బీఎన్‌బీ మాదిరిగానే రెంట్‌కు ఇచ్చేలా కొత్త యాప్‌ను తీసుకు రాబోతున్నాం. కొన్ని గంటలు, రోజులు, వారాలపాటు యాజమానులు తమ కారును రెంట్‌కు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నాం. దాంతో యూజర్లకు అదనంగా ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.
హ్యూమనాయిడ్ రోబోట్స్
‘హ్యూమనాయిడ్ రోబోట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్‌లను విస్తారంగా వాడుతారు. దాంతో కంపెనీ తయారుచేసే ఆప్టిమస్ రోబోలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదు’ అని మస్క్ అంచనా వేశారు.
ఇదీ చదవండి: ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
సస్టైనబుల్ ఎనర్జీ
‘టెస్లా కార్లలో వినియోగించే బ్యాటరీల సమర్థతను పెంచేలా చర్యలు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. స్థిరమైన శక్తిని అందిస్తూ స్టోరేజీ కెపాసిటీను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మస్క్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment