న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్‌లో 42.33 శాతం పెరిగి 35.47 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 62.49 శాతం ఎగసి 55.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 19.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► ఇంజనీరింగ్, పెట్రోలియం రంగాల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా కలిగిన ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు అక్టోబర్‌లో 50.7 శాతం పెరిగి, 9.38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు 232 శాతం ఎగసి 5.19 బిలియన్ డాలర్లకు చేరాయి.
► సమీక్షా నెల్లో పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 44.24 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో 4.22 బిలియన్ డాలర్లకు చేరింది.
► మొత్తం ఎగుమతుల్లో 3.5 శాతం వాటా కలిగిన టెక్స్‌టైల్స్ పరిశ్రమ నుంచి 1.25 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే ఇది 6.4 శాతం అధికం.
► ఎలక్ట్రానిక్ గూడ్స్ విలువ 966 మిలియన్ డాలర్ల నుంచి (2020 అక్టోబర్) 1.34 బిలియన్ డాలర్లకు చేరాయి.
► దిగుమతుల విషయానికి వస్తే, పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తులు 140.5 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ 23% పెరిగి 6.81 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మిషనరీ, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ విభాగం 42% పురోగతితో 3.54 బిలియన్ డాలర్లకు ఎగసింది.
ఏప్రిల్–అక్టోబర్ మధ్య
ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు 55% పెరిగి 232.58 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 79 శాతం పెరిగి 331.29 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య వాణిజ్యలోటు 98.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
సేవలు ఇలా...
కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశం నుంచి సేవల ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 22 శాతం ఎగసి 20.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 25 శాతం పెరిగి 12.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
అక్టోబర్‌లో ఎగుమతులు జూమ్
Published Tue, Nov 2 2021 4:25 AM | Last Updated on Tue, Nov 2 2021 4:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment