న్యూఢిల్లీ: బలవంతపు టేకోవర్ సవాళ్లు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ ఎన్‌డీటీవీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆశ్రయించింది. వీసీపీఎల్‌కు జారీ చేసిన వారంట్లను ఈక్విటీగా మార్పుచేసే అంశంపై స్పష్టత కోసం ప్రమోటర్ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్ లిమిటెడ్ సెబీని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్‌ఆర్‌పీఆర్ తాజా చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. వారంట్ల ద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌లో 99.5 శాతం వాటాను వీసీపీఎల్ పొందనుంది.
తద్వారా ఎన్‌డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఎన్‌డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. కాగా.. ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లను 2020 నవంబర్ 27న సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతున్నందున వారంట్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్‌ఆర్‌పీఆర్ సెబీ నుంచి స్పష్టతను కోరుతోంది.
షేరు జూమ్
వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్‌డీటీవీ కౌంటర్‌కు కొద్ది రోజులుగా డిమాండ్ పెరిగింది. దీంతో మరోసారి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 21 బలపడి రూ. 449 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నాలుగు వారాల్లో ఈ షేరు రూ. 263 నుంచి 70 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 186 లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment