మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్‌లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం.
వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్‌గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. మార్కెట్‌లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్‌గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్‌లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది.
ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే..
ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్‌ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్‌కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment