కోల్‌కతా: వచ్చే దశాబ్ద కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్చే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. పరిశ్రమ కొత్త శిఖారాలకు చేరడంలో తోడ్పడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయంగాను, సుదీర్ఘ దూరాల్లోని అంతర్జాతీయ రూట్లలోను కనెక్టివిటీని మెరుగుపర్చడంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 136గా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 2025 నాటికల్లా 220కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. గత ఏడేళ్లలోనే కొత్తగా 62 విమానాశ్రయాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
మెట్రో నగరాల్లో రెండో ఎయిర్‌పోర్ట్ ఉండాలి
ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో నగరాల్లో రెండో విమానాశ్రయం కూడా ఉండాలని సింధియా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఎయిర్‌పోర్టుల్లో రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని.. కోల్‌కతా సహా మిగతా నగరాల్లో కూడా రెండో ఎయిర్‌పోర్ట్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వచ్చే 100 రోజుల్లో అయిదు కొత్త ఎయిర్‌పోర్టులు, ఆరు హెలీపోర్టులు, 50 ఉడాన్ రూట్లను ప్రారంభించాలని లేదా శంకుస్థాపన అయినా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు.
లాభాల్లోకి ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రా: ఇక్రా అంచనా
ముంబై: విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం ఈ ఏడాది(2021–22) నష్టాల నుంచి బయటపడే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. గతేడాది(2020–21) నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టనున్నట్లు అభిప్రాయపడింది. రూ. 3,250 కోట్ల నిర్వహణ లాభాలు సాధించగలదని పేర్కొంది. ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల్లో 82–84 శాతం వృద్ధి నమోదుకాగలదని వేసిన అంచనాలు ఇందుకు సహకరించగలవని తెలియజేసింది.
కాగా.. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రధాన విమానాశ్రయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ 12–18 నెలలపాటు ఆలస్యంకావచ్చని పేర్కొంది. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, లీజర్ ప్రయాణాలు ఊపందుకోవడం వంటి అంశాలు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఊతమివ్వనున్నట్లు ఇక్రా నివేదిక వివరించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం భారీగా దెబ్బతిన్నట్లు ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ రాజేశ్వర్ బుర్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment