న్యూఢిల్లీ: గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు.
ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ప్రశంసించతగ్గ స్థాయిలో వృద్ధి సాధించగలిగిందన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ వచ్చే నెల ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనితో ఆరు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment