సాక్షి, న్యూఢిల్లీ: లాభాపేక్ష లేని ఆసుపత్రులకు లభించే విరాళాలు, చౌక వడ్డీ రేట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాల ప్రొవిజన్‌పై ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వవలసి ఉన్నట్లు నీతి ఆయోగ్ తాజాగా ప్రతిపాదించింది. పూర్తి స్థాయిలో(100 శాతం) పన్ను మినహాయింపులను కల్పించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. తద్వారా దేశీయంగా ఆరోగ్య పరిరక్షణ సర్వీసులను పటిష్ట పరచవచ్చని తెలియజేసింది. దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్రమైన అధ్యయన నివేదికను నీతి ఆయోగ్ మంగళవారం విడుదల చేసింది.
తెలంగాణలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్స్ సహా పలు ఆసుపత్రులను అధ్యయనం చేయడం ద్వారా కనుగొన్న అంశాలను ఈ నివేదికలో వివరించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సౌకర్యాల నిర్వహణలో ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో గరిష్ట సేవలందించే ఆసుపత్రులు భాగస్వాములు కావడం మేలు చేకూర్చగలదని అభిప్రాయపడింది.
లాభాపేక్షలేని ఆసుపత్రులను గుర్తించేందుకు వీలుగా దాతృత్వ కార్యక్రమాలకుగాను ప్రస్తుతం అమలు చేస్తున్న 50% ఆదాయపన్ను మినహాయింపును 100%కి పెంచాలని ప్రతిపాదించింది. దీంతో నిధుల ఆవశ్యకత ఉన్న సంబంధిత ఆసుపత్రులకు మద్దతు లభిస్తుందని, అవసరమైన ఆసుపత్రులకు తగిన వనరులు సమకూరేందుకు వీలుంటుందని వివరించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ మాట్లాడుతూ ‘దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణకు సంబంధించి పెట్టుబడులు తక్కువ స్థాయిలోనే లభిస్తున్నాయని తెలిపారు.
నివేదికలో కీలక అంశాలు
లాభాపేక్ష లేని ఆసుపత్రులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ వేతనాలు ఇవ్వాల్సి రావడంతో వైద్య నిపుణులు త్వరితగతిన వెళ్లిపోతుండడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన చోట మౌలిక వసతులు లేక వైద్య నిపుణులు వచ్చేందుకు ఇష్టపడకపోవడం, ప్రభుత్వ స్కీములు అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ త్వరితగతిన రాకపోవడం, మౌలిక వసతుల విస్తరణకు ఆర్థిక వనరులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది. అలాగే మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులు ప్రభుత్వ నియంత్రణకు సంబంధించిన పలు నిర్దేశాల అమలు కూడా సవాలుగా మారిందని తెలిపింది.
చదవండి: Covid Vaccine: టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు!
Comments
Please login to add a commentAdd a comment