
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మంచి తోడ్పాటు ఇవ్వనుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రికార్డు స్థాయి ఖరీఫ్ పంట, రబీ మంచి అవకాశాలు భారత్ స్థూల దేశీయాభివృద్ధిని (జీడీపీ) 10 శాతంపైకి తీసుకువెళతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పురోగతి గ్రామీణ డిమాండ్‌కు, తయారీ రంగం సామర్థ్యం మెరుగుదలకు దోహదపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ వార్తాలేఖ ‘అర్థనీతి’లో రాజీవ్ కుమార్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల సమస్యలు, ద్రవ్యోల్బణం సవాళ్లు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి.
► ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి నమోదవుతోంది. 2021–22లో 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశం ఉంది. ఉపాధి కల్పనకూ ఎగుమతుల పురోగతి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం.
► వృద్ధి ధోరణికి కాంట్రాక్ట్ ప్రేరిత సేవలు దోహదపడతాయి.
► విస్తృత ప్రాతిపదికన వ్యాక్సినేషన్ వృద్ధికి తోడ్పాటును ఇచ్చే అంశం. తదుపరి వేవ్ వచ్చినా, నష్టం తక్కువగా చోటుచేసుకోవడానికి దోహపదడే అంశం ఇది.
► విద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, జీఎస్‌టీ వసూళ్లు, ఈ–వే బిల్స్ విభాగాలు ఆర్థిక వృద్ధి రికవరీని సూచిస్తున్నాయి.
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 9.5 శాతంగా అంచనావేస్తుండగా, ఐఎంఎఫ్ అంచనా కూడా ఇదే స్థాయిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment