చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అవి కుదుటపడతాయన్న స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చండీగఢ్‌లో రోజ్‌గార్ మేళా సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ పరిణామాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రోజువారీగా ఉత్పత్తయ్యేది. ఓపెక్ కూటమి రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నది. అనంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా చమురు రవాణాకు భిన్న మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినా మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి.
2021 నవంబర్‌లో, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నేడు చమురుకు కొరత లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ చమురు ధర 72–73 బ్యారెళ్ల వద్దే ఉంది’’అని మంత్రి వివరించారు.
దేశీయంగా 270 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉండగా, దీన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 4 లక్షల బ్యారెళ్ల చమురు బ్రెజిల్ నుంచి మార్కెట్లోకి వస్తోందని, యూఎస్ సైతం మరింత పరిమాణాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పురి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment