ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించడంతో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగిది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగ సంస్థ సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు నేపథ్యంలోనూ ఈ రెండు కంపెనీలూ పటిష్ట ఫలితాలు సాధించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఎన్‌టీపీసీ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎన్‌టీపీసీ లిమిటెడ్ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 2,949 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 3 శాతం నీరసించి రూ. 26,195 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 16 శాతం పెరిగి రూ. 4,280 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో ఎన్‌టీపీసీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది.
సన్ టీవీ నెట్‌వర్క్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సన్ టీవీ నెట్‌వర్క్ నికర లాభం దాదాపు 34 శాతం క్షీణించి రూ. 257 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 715 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 40 శాతం వెనకడుగుతో రూ. 352 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. అయితే సబ్‌స్క్రిప్షన్ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సన్ టీవీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment