న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నవారిలో భారత సంతతికి చెందిన వారు ప్రముఖంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఓగిల్వీ కొత్త గ్లోబల్ సీఈవోగా భాతర సంతతికిచెందిన దేవిక బుల్చందానీ ఎంపికయ్యారు. జూన్ 2020 ఈ పదవిలో ఉన్న ఆండీ మెయిన్ నుండి దేవిక ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆండీ 2022 చివరి వరకు సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు.
ఉత్తర అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్ , సీఈవోగా ఒగిల్వీలో చేరిన రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, దేవిక బుల్చందానీ గ్లోబల్ సీఈవోగా నిలవడం విశేషం. అడ్వర్టైజింగ్ సర్కిల్స్‌లో ఆమెకు పేరుగాంచిన “దేవ్”, రెండు దశాబ్దాలకు పైగా మెక్‌కాన్‌తో ఉన్నారు. మాస్టర్ కార్డ్ అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్‌ను గ్లోబల్ బిజినెస్‌గా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఒగిల్వీ గ్లోబల్ సీఈవోగా 93 దేశాలలో 131 కార్యాలయాలలోపబ్లిక్ రిలేషన్స్, అనుభవం, కన్సల్టింగ్, ఆరోగ్యం ఏజెన్సీ వ్యాపారాలకు బాధ్యత వహిస్తారు.
ప్రపంచంలోనే అతిపెద్ద యాడ్స్ కంపెనీ డబ్ల్యూపీపీలో ఒగిల్వీ ఒక భాగం. లండన్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ఆదాయం 2021 నాటికి 12 బిలియన్ డాలర్లకుపై మాటే. దేవిక ఎంపీకపై డబ్ల్యూపీపీ సీఈవో మార్క్ రీడ్ స్పందిస్తూ, క్రియేటివిటీ చాంపియన్ బుల్చందానీ ప్రతిభా పాటవాలపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా అమృత్‌సర్‌లో బాల్యాన్ని గడిపిన దేవికా బుల్‌చందానీ డెహ్రాడూన్‌లోని వెల్‌హామ్ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇంగ్లీష్, సైకాలజీలో డిగ్రీ, సౌత్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మాస్టర్‌కార్డ్‌తో పాటు, ఆమె క్రాఫ్ట్ అండ్ యూనిలీవర్‌లో పనిచేశారు. 2017లో ఫియర్‌లెస్ గర్ల్ క్యాంపెయిన్ చేపట్టారు. కార్యాలయాల్లో లింగ వైవిధ్యంపై దృష్టి సారించారు. రెండేళ్ల క్రితం ఓగిల్వీలో చేరారు దేవిక బుల్చందానీ.
Comments
Please login to add a commentAdd a comment