న్యూఢిల్లీ: భారతీయుల్లో 37 శాతం మంది క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కరెన్సీగా భావిస్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ ఆస్తిగా 31 శాతం మంది పరిగణిస్తున్నారు. ఈ విషయాలు యూగోవ్ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. వెబ్‌ఈ, క్రిప్టో ఎకోసిస్టమ్‌పై ప్రజల్లో అవగాహన తెలుసుకునేందుకు భారత్ సహా 15 దేశాల్లో ఈ సర్వే జరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 18 మధ్య దీన్ని నిర్వహించారు. మన దేశం నుంచి 1013 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగం కావడంగా క్రిప్టోలను మన దేశీయులు పరిగణిస్తున్నారు. సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో ఆధారిత భవిష్యత్తును తెలియజేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది.
♦ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 92 శాతం మంది క్రిప్టో పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పారు.
♦ 37 శాతం మంది భవిష్యత్తు డబ్బుగా క్రిప్టోని పేర్కొంటే, భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా 31 శాతం మంది తెలిపారు.
♦ మరీ ముఖ్యంగా 17 శాతం మంది క్రిప్టోని స్పెక్యులేటివ్ సాధనంగా చెప్పగా, ఏకంగా 20 శాతం మంది అయితే స్కామ్‌లుగా చెప్పడం గమనార్హం.
♦ ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఇప్పటికే క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు.
♦ వచ్చే 12 నెలల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెడతామని 57 శాతం మంది తెలిపారు.
♦ క్రిప్టోలను పర్యావరణ అనుకూల టెక్నాలజీగా 57% మంది పేర్కొన్నారు.
♦ ఉత్తరాది, మధ్య, తూర్పు భారత్, ఈశాన్య రా ష్ట్రాల్లో అత్యధికంగా 94% మంది క్రిప్టో కరెన్సీ ల పట్ల ఆసక్తితో ఉంటే, పశ్చిమభారత్‌లో 92%, దక్షిణాది రాష్ట్రాల్లో 89% ఆసక్తి వ్యక్తమైంది.
♦ డేటా గోప్యత ముఖ్యమని 62% మంది చెప్పగా, ఇంటర్నెట్‌లో తమ గుర్తింపుపై తమకు మరింత నియంత్రణ అవసరమని 53% మంది తెలిపారు.
♦ క్రిప్టో మార్కెట్లో ఉన్న తీవ్ర ఆటుపోట్లు, స్కాముల భయం ఈ పరిశ్రమలో ప్రవేశానికి పెద్ద అడ్డంకులుగా ఈ సర్వే పేర్కొంది. అలాగే, క్రిప్టో ఎకోసిస్టమ్ సంక్లిష్టంగా ఉండడాన్ని కూడా అవరోధంగా పేర్కొంది.
♦ 53% మంది మెటావర్స్, 41% మంది వెబ్3, 42% మంది ఎన్‌ఎఫ్‌టీ గురించి అవగాహన ఉన్నట్టు ఉన్నారు.
క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదు
రతన్ టాటా స్పష్టీకరణ
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా తనకు క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి అనుబంధం ఏ రూపంలోనూ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో రతన్ టాటాకు పెట్టుబడులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బలంగా ఖండించారు.
‘‘నెటిజన్లూ ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీతో నాకు ఏ రూపంలోనూ అనుబంధం లేదు. క్రిప్టో కరెన్సీతో నాకు అనుబంధం ఉందంటూ ఏదయినా ప్రకటన కానీ లేదా ఆర్టికల్‌ను కానీ చూస్తే అది వాస్తవం కాదు. కేవలం నెటిజన్లను మోసపుచ్చేందుకే’’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. 2021లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment