Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది.
66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది.
యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్‌బోర్డ్ కంపెనీ (1988), నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి.
తైవాన్‌కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్‌లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
భారతదేశంలో ఫాక్స్‌కాన్ ఉనికి
భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్‌లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్‌కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు.
ఫాక్స్‌కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్‌ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్‌కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం.
పద్మ అవార్డ్స్ 2024
కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు.
విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే!
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment