
న్యూఢిల్లీ: పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఇష్యూ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్ర్‌స్కయిబ్ అయ్యింది. మంగళవారం(21న) ప్రారం భమైన ఇష్యూ గురువారం(23)తో ముగిసింది. వెరసి షేరుకి రూ. 165–175 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే చివరి రోజుకల్లా 217 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 17,24,490 షేర్లను విక్రయించడంతోపాటు.. రూ. 141 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ముందురోజు(20న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా రూ. 51 కోట్లు సమకూర్చుకుంది.
ఓయో ఐపీవో సన్నాహాలు
రూ. 8,000 కోట్ల సమీకరణ లక్ష్యం
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ఓయో పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వచ్చే వారంలో దరఖాస్తు చేయనుంది. ఐపీవో ద్వారా 120 కోట్ల డాలర్లు(రూ. 8,000 కోట్లు) సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకుంది.