జీరో నుంచి హీరోగా ఎదిగిన ఎంట్రప్యూనర్ల జాబితాలో ఇటీవల చోటు దక్కించుకున్న విజయ్ శేఖర్ శర్మ జాతీయ గీతం వింటూ ఎమోషనల్ అయ్యారు. నిండు సభలో భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు కారణం చెబుతూ.. ఆ దృశ్యం చూసిన వారి చేతా కన్నీరు పెట్టించారు.
Vijay Shekhar Sharma Got Emotional on Listing Day, Video Goes Viral: ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చింది. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఈ సందర్భంగా 2020 నవంబరు 18 బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజీలో పేటీఎం లిస్టింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విజయ్ శేఖర్ శర్మ కుటుంబంతో సహా ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ పదం వింటే చాలు
జాతీయ గీతం ఆలపించిన తర్వాత విజయ్ శేఖర్ శర్మను మాట్లాడేందుకు వేదిక మీదకు పిలిచారు. మరోసారి జాతీయ గీతం అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘ జాతీయ గీతం ఎప్పుడు వింటున్నా.. ‘భారత భాగ్య విధాతా’ అనే పదాలు వినిపించినప్పడు నా కంట నీరు ఆగవు, ఈసారి కూడా ఆగడం లేదు’ అంటూనే మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకున్నారు. ఆ తర్వాత భారత భాగ్య విధాతా అంటూ దగ్థద స్వరంతో ప్రసంగం కొసాగించారు.
భారత భాగ్య విధాత
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్‌కి చెందిన విజయ్ శేఖర్ శర్మ ఓ సాధారణ టీచరు కొడుకు. పూర్తిగా హిందీ మీడియలో చదువుకోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీషులో ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడేందుకు ఫోర్బ్స్ ఇంగ్లీష్ పత్రికల్లో సక్సెస్‌ఫుల్ పర్సన్స్ స్టోరీలు చదివి. వారి స్ఫూర్తితో స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చదవాలని కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. అయితే సరే తన కలను నిజం చేసుకునే క్రమంలో పట్టు విడవలేదు. ఉద్యోగం చేయాలనే కుటుంబ సభ్యులు కోరికను పక్కన పెట్టి స్టార్టప్‌లు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పూర్తిగా నిలదొక్కుకున్న ఓ కంపెనీని సోదరి పెళ్లి కోసం అమ్మేయాల్సి వచ్చింది. ఆ కంపెనీకి చేసిన అప్పులు కట్టలేక దాదాపు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. కేవలం వడ్డీలు కట్టేందుకే పార్ట్‌టైం జాబ్ చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు విడవలేదు. ప్రయత్నం మానలేదు. 2010లో పేటీఎం స్థాపించాడు. 2017 కల్లా నలభై ఏళ్లకే బిలియనీర్ నిలిచిన వ్యక్తిగా వార్తాల్లోకి ఎక్కాడు. తాజాగా పేటీఎం ఐపీవోకి సెబీ అనుమతి ఇచ్చిన వేళ ఆనందం పట్టలేక తన కింద ఉద్యోగుల ముందే డ్యాన్సులు వేశారు. ఆ ఐపీవోతో ఏకంగా రూ.18,300 కోట్లు సమీకరించాడు. తనతో పాటు పేటీఎం ఎదుగుదలకు కారణమైన 350 మందిని ఒక్క రోజులో కోటీశ్వరులను చేశాడు విజయ్ శేఖర్ శర్మ.
వెలకట్టలేనివి
పేటీఎం విజయ్ శేఖర్ శర్మ ఎదుగుదల వెనున ఎన్నో నిద్ర లేని రాత్రులు, మూడో కంటికి కనిపించని కన్నీళ్లు ఉన్నాయి. అందరికీ తెలిసేలా జరిగిన అవమనాలు, రూపాయి కోసం కాళ్లకు చెప్పులరిగేలా తిండితిప్పలు లేక ఊరంతా తిరిగిన రోజులున్నాయి. తాను కన్న కలలు నిజం చేసుకునేందుకు కష్టనష్టాలను దాటి వచ్చాడు. అక్షరాస్యత తక్కువగా ఉన్న దేశ ప్రజలకు డిజిటల్ పేమెంట్స్‌ని చేరువ చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లోని టీకొట్టు బండి దగ్గర కూడా పేటీఎంతో డబ్బులు చెల్లించేంతగా మార్పులు తీసుకొచ్చాడు. అందుకే జాతీయ గీతంలో ‘భారత భాగ్య విధాత’ అనే పదాలు విన్నప్పుడు అప్రయత్నంగా ఆయన కంట కన్నీరు ఒలికింది. ఈ కన్నీటి విలువ వెలకట్టలేనిది.
మరోసారి చుక్కెదురు
వెలుగు నీడల్లా కష్టసుఖాలు ఎప్పుడూ విజయ్ శేఖర్ శర్మ వెన్నంటే ఉంటాయి. అందుకే ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్‌లోకి ఎంటరైంది. బుధవారం లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. 2021 నవంబరు 18 మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి 15 శాతం క్షీణించి ఒక్కో షేరు ధర రూ.1653ల దగ్గర ట్రేడవుతోంది. పేటీఎం షేర్లు కొన్న ఎంతో మంది ఇన్వెస్టర్లు చాలా డబ్బులు నష్టపోయారు. దీంతో శేఖర్‌కి శాపనార్థాలు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తిట్ల దండకం అందుకున్నారు. మరికొందరు ఇన్వెస్టర్లు లాంగ్‌రన్‌లో పేటీఎం షేర్లు లాభాలు అందిస్తాయనే నమ్ముతున్నారు.
- సాక్షి వెబ్ ప్రత్యేకం
చదవండి:చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. ఇప్పుడు బిలియనీర్
Comments
Please login to add a commentAdd a comment