చెన్నై: కరోనా వైరస్ మహమ్మారిపరమైన అనిశ్చితితో కొనుగోలుదారుల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కటింగ్‌లు వంటి పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని చేతిలో ఉన్న డబ్బును కొనుగోళ్లకు ఖర్చు చేయకుండా, దాచిపెట్టుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. నగదు పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానాల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫ్రిజ్‌లు, టీవీలు, ఫోన్లు మొదలుకుని ద్విచక్ర వాహనాలు దాకా అన్నీ ఈఎంఐల్లో లేదా ’బై నౌ పే లేటర్’ (ముందు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం–బీఎన్‌పీఎల్) మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీఎన్‌పీఎల్ స్కీములకు ఆదరణ పెరుగుతోంది. చదవండి: పసిడి బాండ్ ధర @ రూ. 4,732
డిజిటల్ చెల్లింపుల సంస్థ ఈజీట్యాప్ ద్వారా జరిగే ఈఎంఐ లావాదేవీల పరిమాణం గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 220 శాతం వృద్ధి చెందడం ఇందుకు నిదర్శనం. ‘‘క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాయింట్ ఆఫ్ సేల్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా కూడా ఈఎంఐలను ప్రాసెస్ చేసే సౌలభ్యం ఉండటం .. అలాగే యువతలో బీఎన్‌పీఎల్ స్కీములకు పెరుగుతున్న ప్రాధాన్యత తదితర అంశాలు నెలవారీ వాయిదాల మార్గంలో కొనుగోళ్లు జరగడానికి దోహదపడుతున్నాయి’’ అని ఈజీట్యాబ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ భాస్కర్ చటర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా పలు బీఎన్‌పీఎల్ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తమ యాప్‌లో పే–లేటర్ సర్వీసులను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తమ అనుబంధ సంస్థ ఫ్రీచార్జి ద్వారా కొత్త కస్టమర్ల కోసం బీఎన్‌పీఎల్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్ లావాదేవీల జోరు..
కరోనా వైరస్ కట్టడి కోసం తొలిసారి లాక్‌డౌన్ అమలు చేసిన 250 రోజులతో పోలిస్తే (2020 మార్చి 25 నుంచి నవంబర్ 29 మధ్యకాలం), తర్వాతి 250 రోజుల్లో (2020 నవంబర్ 30 నుంచి 2021 ఆగస్టు 6 వరకూ) డిజిటల్ లావాదేవీలు ఏకంగా 80 శాతం పెరిగాయని ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే వెల్లడించింది. వ్యాపార సంస్థలు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చే కొద్దీ డిజిటల్ లావాదేవీల పరిమాణం సదరు 500 రోజుల్లో గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. పే లేటర్, కార్డురహిత ఈఎంఐలు వంటి కొత్త విధానాల వినియోగం కూడా పెరిగినట్లు పేర్కొంది. పే లేటర్ లావాదేవీలు 220 శాతం, కార్డురహిత ఈఎంఐ లావాదేవీలు 207 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. చౌకైన చెల్లింపు విధానాలకు కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని రేజర్‌పే తెలిపింది.
మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) డిజిటల్ చెల్లింపుల గణాంకాల ప్రకారం.. తరచుగా జరిగే డెబిట్ లావాదేవీలు (ఈఎంఐలు, బీమా ప్రీమియం మొదలైనవి) 4.13 కోట్ల నుంచి 5.77 కోట్లకు పెరిగాయి. విలువపరంగా చూస్తే రూ. 35,351 కోట్ల నుంచి రూ. 61,303 కోట్లకు ఎగిశాయి. ‘‘కోవిడ్ కారణంగా దాదాపు అందరి ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం పడింది. దీంతో చాలా మంది వీలైనంత ఎక్కువగా డబ్బు చేతిలో ఉంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, ఈఎంఐల వైపు మొగ్గుచూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి’’ అని మొబైల్ ఆధారిత ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డుల సంస్థ గెలాక్సీకార్డ్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ తెలిపారు. చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..
కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే!
Published Sat, Aug 28 2021 2:20 AM | Last Updated on Sat, Aug 28 2021 11:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment