కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న విషయం ఇంకా నిరూపితం కాలేదు. కానీ ప్రజల్లో నగదు లావాదేవీలపై కొంత భయం నెలకొంది. కరోనా సోకిన వ్యక్తులు నోట్లను చలామణీ చేసుంటే వైరస్ తమకు కూడా వ్యాపిస్తుందేమోనని ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారణ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ విషయం కాస్త పక్కనపెడితే.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళన కలిగించే అంశం.
బ్యాంకుల వద్ద, కరెంట్ బిల్లులు చెల్లించే ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వైద్య నిపుణులు, అధికారులు కూడా డిజిటల్ పేమెంట్లే మేలనిసూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు, మెడిసిన్‌ను ఆన్‌లైన్‌లో కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చి లాక్‌డౌన్‌కు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పామూరు: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ చైన్ లింక్‌ను తెంపే ఒకే ఒక్క మార్గం భౌతిక దూరం పాటించడం. ఎవరి వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉండటం ఎంతో మంచిది. ఇలాంటి సమయాల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, వాటి చెల్లింపుల్లోనూ కాస్తంత జాగ్రత్తలు పాటించడం మంచిది. వీలైనంత వరకూ నగదును నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను వినియోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలు, పేపర్ నుంచి పచారీ కొట్లలో కొనుగోలు చేసే ప్రతి ఒక్క వస్తువుకూ నోట్లకు బదులుగా ఫోన్ పే, గూగుల్ పే లాంటివి వినియోగిస్తే కొంతనై వైరస్ కట్టడికి ప్రయత్నించవచ్చు.
పామూరులో విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం క్యూలో నిల్చున్న ప్రజలు
భయభయంగా బ్యాంకులకు
నగదు కోసం బ్యాంకులకు వెళ్తే మన చుట్టూ ఉండే ఖాతాదారులు, అధికారులంతా కరోనా వైరస్ రూపంలో దర్శనమిస్తున్నారు. ఎటు నుంచి వచ్చి వైరస్ మనకు సంక్రమిస్తుందోనని భయంభయంతో ఉంటున్నారు. కొంత మంది క్యూ పద్ధతిలో భౌతిక దూరం పాటించకుండా ఇష్టారీతిన ఉంటున్నారు. ఏటీఎంలూ అంతే ప్రమాదం. వీటన్నింటికంటే డిజిటల్ చెల్లింపులే ఎంతో మేలు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఇచ్చింది. విద్యుత్ బిల్లులు, గ్యాస్ సిలెండర్, మొబైల్ బిల్స్ ఇలాంటి 20కి పైగా వాటికి డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment